శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత, ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబుపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఐటీ దాడులు, జీఎస్టీ దాడులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి శివాజీ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్‌బాబు విద్యా సంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే మోహన్‌బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటని శివాజీ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడైనా మోహన్‌బాబు మాట్లాడారా అని నిలదీశారు. హక్కులు అడిగే సమయంలో బాధ్యతలు కూడా నెరవేర్చాలని సూచించారు. శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్‌బాబు తిరుపతిలో నిరసనకు దిగిన విషయం తెలిసిందే.
ఇక ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీని నాశనం చేసే దిశగా కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏపీలో మీకు ఒక నాయకుడు అవసరం లేదు అనుకుంటే... ఆయనను చంపిపడేయాలని... దరిద్రం వదిలిపోతుందని మండిపడ్డారు. మీకు అనుకూలమైన ప్రభుత్వం ఏపీలో రావాలనే ఇదంతా చేస్తున్నారని... అందులో భాగంగా రాష్ట్రంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. రానున్న 15 రోజులు రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉంటాయని తనకు అనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా... హైదరాబాదు కేంద్రంగా రాజకీయాలను చేస్తున్నారని శివాజీ మండిపడ్డారు. హైదరాబాదులో ఆస్తులు ఉన్నవారిని బెదిరిస్తున్నారని... కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. హైదరాబాదులో ఉన్న ఆస్తులను చట్టపరంగా ఏపీ ప్రభుత్వానికి ఇంతవరకు పంచలేదని దుయ్యబట్టారు. ఏపీకి ఏమీ చేయకపోగా... కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
శివాజీ ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ, జీఎస్టీ దాడులపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. ఈ దాడులు సామాన్య ప్రజలను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయని ఆరోపించారు. బ్యాంకుల నుంచి తగిన ఆధారాలతో డబ్బు తీసుకెళుతున్నా సీజ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఈవోకి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల వేళ ఏపీలో అలజడి సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని శివాజీ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగకూడదని.. వాళ్లకు అనుకూలమైన ప్రభుత్వం రావాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని కుట్రలు చేయడం కాదని.. కేసీఆర్ వచ్చి ధైర్యంగా ఏపీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ఎవరికైనా బహిరంగంగా మద్దతు ప్రకటించొచ్చని.. ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని బలిచేయొద్దన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపులో కేసీఆర్ పాత్ర లేదా అని ప్రశ్నించారు.