సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు ప్రశ్నలు సంధించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసును విచారించింది లక్ష్మీనారాయణే. అయితే, జగన్ మీద ఉన్న 14 కేసుల కథేంటో లక్ష్మీనారాయణ ప్రజలకు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ‘లక్ష్మీనారాయణ విశాఖ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన నోరు విప్పాలి. జగన్ 14 కేసుల కథేంటో చెప్పాలి. మీరు పెట్టిన కేసులు ఏమయ్యాయి? మీరు కూడా సమాధానం చెప్పాలి. ఆ కేసులు ఎందుకు పెట్టారు? ఆ సాక్ష్యాలు ఏంటో ప్రజలకు వివరించాలి.’ అని చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబునాయుడు ప్రసంగించారు. రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాల్సి ఉందని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చిందని.. అయితే, ఆ విషయంపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.
‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రులను ఏపీకి పంపి రెచ్చగొట్టిస్తున్నారు. జగన్ మేలు కోసం మోదీ, కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. మైండ్‌గేమ్‌తోనే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్, మాగుంట శ్రీనివాసులురెడ్డిని లాక్కున్నారు. ఆ మూడు పార్టీలకు బుద్ధి చెప్పాలి. తెలంగాణలో ఇతర పార్టీలు లేకుండా చేసి, ఏకపక్షంగా వ్యవహరించాలని తెరాస ప్రయత్నిస్తోంది’’ అని విమర్శించారు. ‘‘వైకాపా అధినేత జగన్‌కు ఆంధ్రా పోలీసులు, వైద్యులపై నమ్మకం లేదు. ఆంధ్రలో ఓట్లు మాత్రం కావాలంటారు. ఆయన చిన్నాన్న హత్యను రాజకీయం చేస్తూ తెదేపాపై నిందలు వేస్తున్నారు." అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ప్రత్యేక హోదా వైకాపాకు బోరింగ్ సబ్జెక్ట్ అట. ఈ మాట వైకాపా ఎంపీ అభ్యర్థులే అంటున్నారు. వీళ్లను గెలిపిస్తే ఏం చేస్తారు. మోదీ మేలు కోసం వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి, ఎన్నికలు రాకుండా డ్రామా ఆడారు. నాయకులను బెదిరించడం, ప్రలోభాలు పెట్టడం, ఆర్థిక మూలలు దెబ్బతీయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీనిపై తెదేపా అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. రైతులపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. వాన్‌పిక్‌లో 28 వేలు, లేపాక్షిలో 8,808, బ్రహ్మణి స్టీల్స్‌లో 10వేల ఎకరాలు భూములు... జగన్ కేసులలో చిక్కుకుని ప్రజోపయోగం లేకుండా పోయాయి. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. జగన్ సమాజానికే పెనుప్రమాదంగా మారారు. పులివెందుల హత్యపై డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నారు’’ అని చంద్రబాబు విమర్శించారు.