కాసేపట్లో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. నామినేషన్ సందర్భంగా న్యాయమూర్తి ముందు సీఎం ప్రమాణం చేయనున్నారు. ప్రమాణం చేసిన సర్టిఫికెట్‌ను చంద్రబాబు కుప్పం పంపనున్నారు. కుప్పంలో నామినేషన్‌కు వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నందున.. వేరే వ్యక్తితో చంద్రబాబు నామినేషన్ పత్రాలను పంపుతున్నారు. చంద్రబాబు ఈనెల 22న కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. విదియ తిథితో కూడిన శుక్రవారం నామినేషన్ వేయడానికి మంచి ముహూర్తమని ఆ తేదీని నిర్ణయించారు. అయితే చంద్రబాబు గత మూడు దఫాలుగా ఎన్నడూ స్వయంగా వచ్చి నామినేషన్ వేయలేదు. ఆయన తరఫున పార్టీలోని స్థానిక ముఖ్యులే ఆ ప్రక్రియను పూర్తి చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కుప్పం వచ్చి తండ్రి తరఫున నామినేషన్ దాఖలు చేశారు.
ఈసారి ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తుండడంతో అక్కడ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరిని చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి ఆహ్వానిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె రాలేకపోయిన పక్షంలో గతంలో మాదిరే టీడీపీకి చెందిన స్థానిక ముఖ్యులు టీడీపీ అధినేత తరఫున నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారులకు అందజేస్తారని సమాచారం. చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఆరుసార్లు గెలిచారు. ఏడోసారి పోటీ చేసి గెలిచేందుకు ఆయన సర్వం సిద్ధం చేసుకున్నారు. 1989లో కుప్పం నుంచి తొలిసారి పోటీచేసిన చంద్రబాబు అలుపెరుగని జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో చంద్రబాబు ఓ సెంటిమెంట్ ఉంది.
సాధారణంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి వద్ద కొంత నగదు డిపాజిట్ చేయాలి. ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లు వచ్చిన అభ్యర్థులకు ఆ డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారు. అంతకంటే తక్కువ వస్తే డిపాజిట్ కోల్పోయాడు అంటారు. అయితే చంద్రబాబు నామినేషన్ వేసే సమయంలో తన సొమ్మును డిపాజిట్ చేయరు. ఆయన డిపాజిట్ సొమ్ము కోసం కుప్పం టీడీపీ నేతలు ప్రజల నుంచే విరాళాలు సేకరిస్తుంటారు. 1999 ఎన్నికల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో కూడా చంద్రబాబు డిపాజిట్ నగదు కోసం టీడీపీ నేతలు విరాళాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఎస్ మునిరత్నం తదితరులు సోమవారం రామకుప్పంలో ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. మరో నాలుగురోజుల పాటు విరాళాలు సేకరించిన తర్వాత ఈ నెల 22న చంద్రబాబు తరపున వెలుగు సంఘాలు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.