ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో భారీగా మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అసాధారణ రీతిలో సిటింగ్ ఎమ్మెల్యేల్లో 43 శాతం మందిని మార్చి.. కొత్తవారికి అవకాశం కల్పించారు. ఈ స్థాయిలో మార్పులు ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున 102 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇద్దరు స్వతంత్రులు, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తర్వాత ఆ పార్టీలో చేరారు. వీరితో కలిపి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 127కి పెరిగింది. ఈ సీట్లలో 34 చోట్ల ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించారు. ఒకట్రెండు చోట్ల ఎమ్మెల్యేలు బలంగా ఉన్నా ఇతరత్రా సమీకరణల కారణంగా మార్చారు. అటవీ మంత్రి శిద్దా రాఘవరావు తన నియోజకవర్గమైన దర్శిలో బలంగా ఉన్నారు.
కానీ ఆయన్ను ఒంగోలు లోక్‌సభ స్థానానికి పోటీచేయిస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే, మార్కెటింగ్ మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా.. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభను రాజంపేట లోక్‌సభకు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును నరసాపురం లోక్‌సభకు నిలుపుతున్నారు. ఇద్దరు మంత్రులు సహా నలుగురు సిటింగ్ ఎమ్మెల్యేల సీట్లు మార్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తన స్థానమైన భీమిలిని వదిలి ఈసారి విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు. ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్‌ను కొవ్వూరు నుంచి తిరువూరుకు, పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను కొవ్వూరుకు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శికి మార్చారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును నక్సల్స్ హత్య చేయడంతో.. ఆయన కుమారుడు, గిరిజన సంక్షేమ మంత్రి శ్రావణ్‌కు ఆ టికెట్ ఇచ్చారు.
నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయారు. రావెల కిశోర్‌బాబు (ప్రత్తిపాడు) జనసేనలోకి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి (గుంటూరు పశ్చిమ), మేడా మల్లికార్జున్‌రెడ్డి (రాజంపేట), ఆమంచి కృష్ణమోహన్ (చీరాల) వైసీపీలోకి వెళ్లారు. ఆ సీట్లలో టీడీపీ కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. ఈసారి అవకాశం లభించని ఎమ్మెల్యేల్లో గౌతు శివాజీ (పలాస), కిమిడి మృణాళిని (చీపురుపల్లి), మీసాల గీత (విజయనగరం), వరుపుల సుబ్బారావు (పత్తిపాడు), పులవర్తి నారాయణరావు (పి.గన్నవరం), పీతల సుజాత (చింతలపూడి), ముడియం శ్రీనివాసరావు (పోలవరం), జలీల్‌ఖాన్ (విజయవాడ పశ్చిమ), డేవిడ్‌రాజు (ఎర్రగొండ పాలెం), ఎస్‌వీ మోహన్‌రెడ్డి (కర్నూలు), కేఈ కృష్ణమూర్తి (పత్తికొండ), మణిగాంధీ (కోడుమూరు), పరిటాల సునీత (రాప్తాడు), యామినీబాల (శింగనమల), హనుమంతరాయ చౌదరి (కల్యాణదుర్గం), చాంద్‌బాషా (కదిరి), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి), తలారి ఆదిత్య (సత్యవేడు), కాగిత వెంకట్రావు (పెడన), జేసీ ప్రభాకర్‌రెడ్డి (తాడిపత్రి) ఉన్నారు. పలాస, చీపురుపల్లి, విజయవాడ పశ్చిమ, పత్తికొండ, రాప్తాడు, శ్రీకాళహస్తి, పెడన, తాడిపత్రిల్లో సిటింగ్ ఎమ్మెల్యేల కుమారులు లేదా కుమార్తెలకు ఈసారి అవకాశం దక్కింది.