‘‘పైన చంద్రబాబు ఉన్నారు. కింద క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు బలంగా పని చేస్తున్నాయి. మన గెలుపు ఖాయం!’’... ఇది తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు అభ్యర్థుల నమ్మకం! అది ఎంత బలంగా ఉందంటే... ప్రచారాన్ని కూడా ‘లైట్’గా తీసుకుని, ఎన్నికల వ్యూహాలను పక్కన పెట్టి, ఎంచక్కా ‘రిలాక్స్’ అయ్యేంత! మరోసారి అధికారంలోకి రావడం రాష్ట్రానికీ, పార్టీకీ ఎంతో ముఖ్యమని చంద్రబాబు రాత్రింబవళ్లు పనిచేస్తుండగా... చాలాచోట్ల అభ్యర్థులు మాత్రం అతివిశ్వాసంతో బిందా్‌సగా, కడుపులో చల్ల కదలకుండా పైపైన తిరుగుతున్నారని పార్టీ పెద్దల దృష్టికి వచ్చింది. టీడీపీ ఇప్పటికి 140 సీట్లలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 35 స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో రోజుకు మూడు నాలుగు జిల్లాల్లో తిరుగుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అభ్యర్థులకు సంబంధించి జిల్లాల నేతలతో మాట్లాడటం, కొందరిని పిలిపించి బుజ్జగించడం వంటివి కూడా కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి దాటి 2 గంటల వరకు కూడా ఈ కసరత్తులో మునిగి తేలుతున్నారు.
తిరిగి ఉదయాన్నే లేచి ముందుగా ఖరారైన పర్యటనలకు వెళుతున్నారు. అధినేత ఆ వయసులో అంతగా శ్రమిస్తుండగా... అభ్యర్థుల్లో మాత్రం ఆ చురుకుదనం కనిపించడంలేదని ఆ పార్టీ శ్రేణుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పింఛను రెట్టింపు, పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి రెట్టింపు, అన్నదాత సుఖీభవ, కౌలు రైతులకూ సహాయం వంటి సంక్షేమ పథకాలతో క్షేత్ర స్థాయిలో తెలుగుదేశానికి ఆదరణ బాగా పెరిగింది. టీడీపీ అభ్యర్థులకు ఇది ఒక టానిక్‌లా మారింది. ఎక్కడికి వెళ్లినా ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ వాతావరణంలో తమ గెలుపు ఖాయమన్న మితిమీరిన నమ్మకంతో... ఎన్నికల్లో అసలు పనిని వదిలేసి పైపైన తిరుగుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేయడంతోపాటు.. అభ్యర్థులకు అనేక పనులు ఉంటాయి. సొంత పార్టీలో గుర్రుగా ఉన్న వారిని గుర్తించి, వారితో మాట్లాడి, మద్దతు సాధించాలి. సమస్యలు అపరిష్కృతంగా ఉన్న గ్రామాలు, వార్డులకు వెళ్లి స్థానికులకు నచ్చచెప్పాలి. సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇవ్వాలి.
ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధిపొందిన వారి వద్దకు స్వయంగా వెళ్లి... వారికి జరిగిన మేలు గురించి వివరించి, తమకే ఓటు వేయాలని కోరాలి. ప్రత్యర్థి పార్టీకి బలం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహాలు రచించి, అమలు చేయాలి. వివిధ వృత్తులు, సామాజిక వర్గాల వారిని గుర్తించి వారితో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరడం సహజం. వెరసి... అభ్యర్థులకు క్షణం తీరికలేనంతగా ఎన్నికల పనిలో ఉండాలి. పైగా... ఈసారి పోలింగ్‌కు ఎక్కువ సమయం కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ... ఎక్కువ మంది ఎమ్మెల్యే అభ్యర్థులు చేయాల్సిన పనులేవీ చేయకుండా, పైపైన తిరిగి ప్రచారం అయిపోయిందని అనిపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ‘‘అతి ధీమానే దీనికి కారణం. ఎక్కువగా కష్టపడకుండానే గెలిచిపోతామన్న నమ్మకం వచ్చింది. దీంతో పని చేయడం తగ్గించేశారు. విశ్రాంతిగా తిరుగుతున్నారు. ప్రత్యర్థి పార్టీల వారు భయంతో ఎక్కువ పని చేస్తుంటే... మా వాళ్లు ఎక్కువ నమ్మకంతో పని తగ్గించేస్తున్నారు’’ అని అభ్యర్థుల ప్రచారాన్ని సమన్వయం చేస్తున్న ఒక ఎమ్మెల్సీ వాపోయారు. ఎన్నికలు మొదటి దశలో రావడం వల్ల ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఖర్చు కూడా తగ్గిందని, ఆ సానుకూలతను అందిపుచ్చుకొని ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కొందరు వెనకబడిపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి జిల్లాల్లో ఒకరిద్దరు అభ్యర్థులు ఇంకా గ్రామాల్లో పర్యటనలు కూడా మొదలు పెట్టలేదని, నామినేషన్ వేసిన తర్వాత వెళతాం అని తాపీగా చెబుతున్నారని ఒక నాయకుడు తెలిపారు.