వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన సమాచారం, ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, పరిగణలోకి తీసుకుని, సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ జగన్ బంధువులను కూడా సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలపైనా సిట్ దృష్టి సారించింది. వివేకా హత్య ఘటనా స్థలంలో దొరికిన లేఖను అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వివేకానందరెడ్డి కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. వివేకా హత్యపై జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. రెండు రోజుల్లోనే కేసు ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. అయితే జగన్ ఫామిలీని విచారణ చేస్తే, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకొంటాయో చూడాలి.
లేఖపై లోతైన విచారణ... వైఎస్ వివేకానందరెడ్డి డ్రైవరుపై రాసినట్లుగా చెబుతున్న లేఖకు సంబంధించి ప్రస్తుతం లోతైన అధ్యయనం జరుగుతోంది. తీవ్ర గాయాలపాలైన వ్యక్తి లేఖ రాయడానికి ఎంత వరకూ అవకాశం ఉంటుందన్న దానిపైనే ప్రధానంగా అధికారులు దృష్టి సారించారు. వివేకా డైరీల్లోని రాతను, లేఖలోని రాతతో సరిపోల్చే బాధ్యతను ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించారు. వివేకా ఇంటి వెనుక వైపు తలుపు తెరచుకుని ఉన్న క్రమంలో ఆ దిశగానూ విచారణ ముమ్మరం చేశారు. హంతకులు ముందుగానే లోపలికి వచ్చి మకాం వేశారా? లేక వివేకా లోపలికి వచ్చిన తరువాత ప్రవేశించారా? అన్న దిశగా విచారిస్తున్నారు.
‘సాక్ష్యాలు చెరపడం’పై దృష్టి... వివేకా హత్య కేసులో ప్రధానంగా ‘సాక్ష్యాలు చెరపడం’ అన్న అంశమే కీలకంగా మారింది. దీనిపై విచారణ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఉదయం గుండెపోటుగా ప్రచారం జరగడం.. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కావడం.. వైద్యుల శవపరీక్ష అనంతరం హత్యగా ప్రాథమికంగా నిర్ధారణకు రావడంతో ‘ఉదయం’ ఏం జరిగిందన్న దానిపై విచారణ సాగుతోంది. వివేకా విగతజీవిగా పడి ఉన్నట్లు తొలుత గుర్తించిందెవరు? ఆ తరవాత వారు ఎవరికి సమాచారం ఇచ్చారు? అక్కడికి ఎవరెవరు చేరుకున్నారు? అనంతరం ఏం జరిగింది? అన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. రక్తపు మరకలు కడిగేశారన్న విమర్శల నేపథ్యంలో ఆ దిశగానూ విచారణ జరుగుతోంది. పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం నుంచి కేసు లేకుండా ఒత్తిడి చేయడం వరకు పలు అంశాల్లో దర్యాప్తు సాగుతోంది.