రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశానికి ముందు సీఎం చంద్రబాబు ఎంతో సరదాగా వ్యవహరించారు. మీడియా ప్రతినిధులు కొందరు సకాలంలో ప్రెస్ మీట్ కు రాకపోవడంతో వారికోసం వేచిచూశారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక ఉపోద్ఘాతాలు లేవు బుల్లెట్ లా దూసుకుపోవడమే అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎంతో పాప్యులర్ అయిన "సమయం లేదు మిత్రమా" అనే బాలకృష్ణ డైలాగ్ ను తనదైన శైలిలో "కాలం లేదు మిత్రమా" అంటూ మీడియా మిత్రుల ఆలస్యానికి అన్వయించారు టీడీపీ అధినేత. ఆ తర్వాత అందరూ వచ్చేశారా, ఇక ముందు మాటలు అక్కర్లేదు, దూసుకుపోవడమే అంటూ ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. అంతేకాదు, సినీ భాషలో 'మీరు టేక్ రెడీ అంటేనే మేం మాట్లాడతాం' అంటూ విలేకరులతో చమత్కరించారు. వారు చెప్పిన దానికి 'ఓకే అగ్రీడ్' అంటూ తనదైన శైలిలో మందహాసం చేశారు చంద్రబాబు.
అక్రమ నిర్మాణం పేరిట ఏపీ డీజీపీ ఇంటి ప్రహరీని కూల్చివేసిన, ఏమీ లేకున్నా ‘డేటా చోరీ’ పేరిట పోలీసులను పంపిన కేసీఆర్... కూకట్‌పల్లిలో జగన్ అక్రమంగా సొంతం చేసుకున్న 11.10ఎకరాలను ఎందుకు వదిలేశారని చంద్రబాబు ప్రశ్నించారు. రూ.500కోట్ల విలువైన భూమిని, వేల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కేసీఆర్ కాపాడారన్నారు. ‘ఏపీలో జగన్ గెలిస్తే నీ కాల్మొక్తా బాంచన్.. అని కేసీఆర్‌కు లొంగిపోతారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడతారు. రాష్ట్ర హక్కుల గురించి ఒక్కమాట కూడా మాట్లాడని అవమానకర పరిస్థితికి తీసుకెళ్తారు. ఏపీని కేసీఆర్‌కు సామంత రాజ్యం లా మార్చేస్తారు’ అని తెలిపారు. ‘విచారణ జరగకుండా మోదీ అడ్డుకోగా... అక్రమంగా జగన్ కొ ట్టేసిన భూకేటాయింపును కేసీఆర్ రద్దుచేయలేదు. వారి కుమ్మక్కుకు ఇదే నిదర్శనం’ అని తెలిపారు.
చెస్‌లో గ్రాండ్ మాస్టర్‌లాగా నేరాల్లో జగన్ గ్రాండ్ మాస్టర్ అని చంద్రబాబు విమర్శించారు. తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్లు.. తాను చెడిందే కాకుండా ఏపీని కూడా చెడగొట్టాలని జగన్ చూస్తున్నారన్నారు. ‘దొంగ వ్యాపారాలు, బోగస్ షేర్లు, షెల్ కంపెనీలు, ఫెమా ఉల్లంఘన... ఆయన నేరాలకు అంతేలేదు. ఇప్పడు రాజకీయంలోనూ నేరాలను చొప్పించే కుట్రలు చూశాం. లక్షలాది ఓట్ల తొలగించాలనే ఆలోచనలు ఎవరికైనా వస్తాయా? 9లక్షల ఫామ్-7 దరఖాస్తులు పంపడం దేశ చరిత్రలో చూశామా? ప్రత్యర్థి పార్టీ డేటా ఎత్తుకుపోవాలన్న ఆలోచన ఎవరైనా చేశారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈడీ రాసిన లేఖలో పీవీపీ బిజినెస్ వెంచర్స్ పేరు కూడా ఉందని చెప్పారు. ‘దాని అధినేత పొట్లూరి వరప్రసాద్‌కు ఇప్పుడే జగన్ వైసీపీ కండువా కప్పారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థి అంటారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని కూడా జగన్ పట్టించుకోరు’ అని చంద్రబాబు అన్నారు.