వైఎస్ వివేకానంద మృతి పై సంచలన నిర్ణయం తీసుకుంది ఏపి ప్రభుత్వం. హత్య విషయంలో, ప్రతిపక్షం ఆరోపణలు ఉదృతం చేస్తూ, ఫ్యామిలీ గోడవలని రాష్ట్ర శాంతి బధత్రల చర్యగా మార్చి, గొడవలు చెయ్యాలనే ఆలోచనలో జగన్ పక్షం ఉండటంతో, ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యింది. హత్య విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అడిషనల్ ఎస్పీ బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. వివేకా మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనుమానాస్పద మృతి వార్తలపై చంద్రబాబు తక్షణమే స్పందించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన స్పష్టం చేశారు.
వివేకా మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకా మృతి పట్ల అనుమానాలు రావడంపై వెంటనే స్పందించారు. అప్పటికప్పుడు పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు, కడప పోలీసులతో చంద్రబాబు మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులను రప్పిస్తున్నామని, కేసును సీరియస్‌గా తీసుకున్నామని ఆయన తెలిపారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కడప ఎస్పీ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, వైఎస్ వివేకా ఇంటికి చేరుకున్న డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించింది.
ఆయన శరీరంపై ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయని తెలిపారు. వివేకానంద రెడ్డి తలపైన, ఛాతిపైనా గాయాలు ఉన్నాయని, ఈ హత్యకు సంబంధించి తాము కొన్ని ఆధారాలు సేకరించినట్టు చెప్పారు. ఘటనా స్థలంలో కొన్ని వేలిముద్రలు గుర్తించామని, అవి ఎవరివో తేల్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తుందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని స్పష్టంచేశారు. ఈ కేసు విచారించి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.