మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిది సాధారణ మరణం కాదనీ… అతడిని హత్య చేశారని పోస్టుమార్టమ్ రిపోర్టులో తేలింది. ఆయన నుదురు, తల వెనుక, చేతుల భాగంలో దాడి చేసినట్టుగా… లోతైన గాయాలున్నట్టు డాక్టర్లు తేల్చారు. పదునైన ఆయుధాలు వాడినట్టుగా డాక్టర్లు వివరించారు. వైఎస్ వివేకానందరెడ్డి నుదుటిపై లోతుగా రెండు గాయాలున్నాయని.. వీటిని వేట కత్తులతో వేసినట్టుగా భావిస్తున్నారు. వివేకా తల వెనుక భాగంలోనూ బలమైన గాయం అయింది. దాడిని అడ్డుకునేందుకు చేతులు అడ్డుపెట్టినప్పుడు చేతులపై గాయాలైనట్టు భావిస్తున్నారు. నుదిటి పై రెండు లోతైన గాయాలు, తల వెనుక మరో గాయం, ఛాతి భాగంలో ఒకటి, తొడ భాగంలో ఒక గాయం, చేతిపై మరో గాయం ఇలా.. మొత్తం ఏడు గాయాలున్నట్టు పోస్టుమార్టమ్ రిపోర్టు నిర్ధారించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా వైఎస్ వివేకాది హత్యే అని నిర్ధారించారు పోలీసులు.
వైఎస్ వివేకానందరెడ్డి గురువారం రాత్రి ఒక్కరే ఇంట్లో ఉన్నారని పీఏ కృష్ణారెడ్డి చెప్పారు. ఉదయం ఇంటికి వెళ్లి పిలిస్తే ఆయన లేవలేదనీ.. పార్క్ సైడ్ డోర్ తెలిచి ఉండటంతో.. అందులోంచి ఆయన బెడ్ రూమ్ కు వెళ్లామనీ… అక్కడే బాత్రూమ్ లో ఆయన పడిఉన్నాడని తెల్సుకున్నామన్నారు. తెల్లవారుజామున బాత్ రూమ్ లో రక్తపు మడుగులో వివేకా పడి ఉన్నాడని… ఆయనే కుటుంబసభ్యులకు చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు సిట్ ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది.
తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వైఎస్ వివేకాకు ఒక కుమార్తె ఉంది. అయితే వివేకా మృతిపై పలు అనుమానాలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా తల, చెయ్యికి గాయాలు కావడంపై అనుమానం మరింత పెరిగింది. సమాచారం తెలుసుకున్న ప్రతిపక్ష నేత జగన్, వివేకా కుమారై, ఆయన సతీమణీ హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరారు. శనివారం వివేకా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వివేకా ఇంటిని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ పరిశీలించాయి. వివేకా మృతి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులను రప్పిస్తున్నామని, కేసును సీరియస్‌గా తీసుకున్నామని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కడప ఎస్పీ హెచ్చరించారు.