‘తప్పైంది సార్.. సరి చేసుకుంటాను.. అందర్నీ కలుపుకెళ్తా.. అని సీఎం చంద్రబాబు వద్ద టీడీపీ నూజివీడు ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారని తెలిసింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సీఎం చంద్రబాబు, నూజివీడు అసెంబ్లీ సీటు పంచాయితీ చేశారు. ముద్దరబోయినకు, ఆయనపై అసంతృప్తితో ఉన్న గ్రూప్‌నకు అక్షింతలు వేశారు. రెండుగ్రూపులు లోపలికి వెళ్లగానే ముద్దరబోయిన పై అసంతృప్తితో ఉన్న కాపా శ్రీనివాసరావు, నూతక్కివేణుగోపాలరావు, నక్కబోయిన వేణుయాదవ్, వంటి నాయకులు నాలుగేళ్లుగా ముద్దరబోయిన ఎలాంటి ఇబ్బందులకు గురిచేసింది? సీఎంకు చెప్పారు. దీంతో సీఎం చంద్రబాబు ముద్దరబోయినతో నీకు గతంలోనే చెప్పా అందరినీ కలుపుకెళ్లాలని సూచించినా పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
2014లో నేను చేసిన తప్పు ఏమిటంటే పార్టీ ఓడిన చోట ఇన్‌చార్జ్‌లను నియమించడం. కొత్త రాష్ట్రం కావడంతో ఓడిన నియోజకవర్గాల పై దృష్టి పెట్టలేకపోయా, నాడే ఇన్‌చార్జ్‌లకు బదులు 5 మెన్ కమిటీ వేయవలసింది. ఇక నుంచి అదే చేస్తానని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. ‘ఓడినా నీకు ఇన్చార్జ్ ఇవ్వడంతో కొమ్ములొచ్చాయి. ఒకరి నొకరు ఓడించుకుంటే నష్టపోయేది మీరే. మళ్లీ ఇదే ఫలితం నూజివీడులో వస్తే కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటా..’నని ఇరువర్గాలకు సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ముద్దరబోయిన సీఎంకు పైవిధంగా సారీ చెప్పి, అందర్ని కలుపుకుని వెళతానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.ఉభయవర్గాలు బయటకు వచ్చిన తరువాత తనపై అసంతృప్తితో ఉన్న నాయకుల వద్దకు ముద్దరబోయిన వెళ్ళి సారీ! తప్పులు ఉంటే క్షమించండి, కొన్ని పొరపాట్లు జరిగాయి. అందరం కలిసి పని చేసుకుందామని చెప్పినట్లు సమాచారం. ఆ నేతలు మిగతా విషయాలు తరువాత మాట్లాడుకుందాం అని ముద్దరబోయినకు చెప్పినట్లు తెలిసింది
సీఎం వద్దకు తీసుకెళ్లే నాయకుల విషయంలో ముద్దరబోయినపై ముసునూరు మండల నాయకులు చిలుకూరి వెంకటేశ్వరరావు, మండలపార్టీ అధ్యక్షుడు దేవినేని బలరామ్ తదితరులు అలిగి సీఎం చర్చల్లోకి వెళ్లకుండానే వెనుదిరిగారు. స్థానిక నాయకులు ఎవరైనా తప్పుచేసినా, నియోజకవర్గ నాయకుడు ఆ తప్పు చేయకూడదంటున్నారు. సీఎం వద్దకు సాధారణ స్థాయి నాయకులను ముద్దరబోయిన తీసుకెళ్లడంతో వీరు కినుక వహించి వెనుతిరిగినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు కలిసి పనిచేయండి అని నూజివీడు నాయకులకు చెప్పి పంపారు. కాని వీరిమధ్య ఏర్పడిన విభేదాలను సరిదిద్దే ఏర్పాటు మాత్రం జరగలేదు. జిల్లా నాయకులు దీనిపై దృష్టిపెట్టి, రెండు గ్రూపులను కూర్చోబెట్టి, ఎన్నికల కమిటీని ఏర్పాటుచేయకపోతే నియోజకవర్గంలో ఎవరికి వారే యమునా తీరే చందాన పరిస్థితి మారే అవకాశముంది.