వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత. ఆయన కొన్నేళ్లుగా.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై ఓ రకంగా కక్ష గట్టారు. అదీ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పోలీసులనే టార్గెట్‌గా చేసుకున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా.. అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రా పోలీసులపై విరుచుకుపడుతున్నారు. తనకు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదని కనీసం 50 సార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మొదటి నుంచి వైఎస్ జగన్ ఇదే వైఖరిని అవలంబిస్తున్నారు. సొంత రాష్ట్రంలోని అధికార వ్యవస్థల పట్ల వైఎస్ జగన్ వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. జగన్ ప్రసంగాల్లో పోలీసులు, అధికారుల పట్ల నమ్మకం లేదంటూ.. చెప్పడం పట్ల జనం కూడా ఆలోచనలో పడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో నివసిస్తూ.. స్వరాష్ట్రంలోని వ్యవస్థలమీదే నమ్మకం లేకుంటే.. మరి.. జగన్‌మోహన్‌ను తాము ఎలా నమ్మాలని జనం పునరాలోచనలో పడ్డారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మాట్లాడితే నమ్మకం లేదంటున్నారు జగన్. పోలీసు వ్యవస్థ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొడుతున్నారు. గందరగోళ పరిస్థితులు సృష్టించడానికే ఇలా చేస్తున్నారా? పదే పదే ఈ వైఖరి అవలంబిస్తే పోలీసులు వెనక్కి తగ్గుతారనుకున్నారా ? పదుల సంఖ్యలో కేసులున్న తన జోలికి రారని డిసైడ్ అయ్యారా? వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై 31 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికలకోసం నామినేషన్‌తో పాటు.. తాను దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్వయంగా జగన్ ఈ వివరాలు పేర్కొన్నారు. 11 సీబీఐ కేసులు, ఏడు ఈడీ కేసులు, పోలీస్‌స్టేషన్లు, కిందికోర్టుల్లో 13 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే.. స్వరాష్ట్రంలో రాజకీయాలు చేసే జగన్.. పొరుగు రాష్ట్రంలోనే నివసిస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత అయినప్పటికీ.. రాష్ట్రానికి చుట్టపు చూపుగానే.. వచ్చిపోతున్నారన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో సొంత రాష్ట్రంలోని పోలీసులు తన జోలికి రాకుండా ఉండేందుకే జగన్.. రివర్స్ ఎటాక్ చేస్తున్నారా అన్న చర్చ ఏపీలో ఇప్పుడు జోరుగా సాగుతోంది. విశాఖ కమిషనర్ యోగానంద్‌ను నెట్టేసి సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన జగన్ మోహన్‌రెడ్డి.. తాను ఎవరినీ మర్చిపోనని చెప్పుకున్నారు. 2017 జనవరి 26.. రిపబ్లిక్ డే రోజున విశాఖలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సమయంలో అనుమతిలేని నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు జగన్ వెళ్లారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లిన జగన్.. ఎయిర్‌పోర్టు రన్‌వే పైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంలో.. అప్పటి విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్‌ను పక్కకు తోసేయడంతో పాటు.. సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నెలరోజులకే కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్.. జిల్లా కలెక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. పోలీస్ టు కలెక్టర్ అందరూ అవినీతికి పాల్పడుతున్నారని, నిన్ను కూడా సెంట్రల్‌జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
ఇలా.. ప్రధానంగా ఏపీ పోలీసులనే టార్గెట్‌గా చేసుకున్న వైఎస్ జగన్.. కోడికత్తి కేసు విషయంలో బోల్తా పడ్డారు. సంఘటన జరగ్గానే ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ కేసుపై దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. పదులసంఖ్యలో సాక్షులను, అనుమానితులను ప్రశ్నించి మూలాలను కూడా వెలికి తీసేందుకు యత్నించారు. కానీ.. ఏపీ పోలీసుల విచారణపై నమ్మకం లేదన్న జగన్.. కేంద్రప్రభుత్వ పెద్దలకూ ఫిర్యాదుచేశారు. ఏపీ పోలీసులు మినహా.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. ఫలితంగా ఉగ్రవాదంపై నిరంతరం నిఘా పెట్టే, దేశ భద్రతకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్‌ఐఏ తో మరోసారి కోడికత్తి కేసును దర్యాప్తు చేయించారు. కానీ.. ఎన్‌ఐఏ దర్యాప్తులో ఏ ఒక్క కొత్త అంశమూ బయటకు రాలేదు. ఏపీ పోలీసులు దర్యాప్తులో ఏం తేల్చారో ఎన్‌ఐఏ కూడా చివరకు అదే తేల్చింది. కానీ.. వైఎస్ జగన్ సహా.. వైసీపీ నేతలు ఆ సమయంలో నానాయాగీ చేశారన్న విమర్శలు వచ్చాయి. కీలక కేసులను దర్యాప్తు చేయాల్సిన ఎన్‌ఐఏ అధికారులను ఇంత చిన్న కేసులో జోక్యం చేసుకునేలా చేశారన్న ఆరోపణలు తలెత్తాయి. పైగా.. విశాఖలో కోడికత్తితో దాడి జరిగితే.. అవే రక్తపు మరకలతో జగన్ హైదరాబాద్ దాకా వచ్చారు. ఏపీలో కనీసం అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేయించుకునేందుకు కూడా నమ్మకం లేదన్న జగన్ తీరు ఎన్నికల సమయంలో ఆలోచనను రేకెత్తిస్తోంది.