ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హోరు రసవత్తరంగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. ఓవైపు బహిరంగ సభలు.. రోడ్ షో ప్రచారాలు.. మరోవైపు అంతర్గత వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసే పథక రచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ చర్చలన్నీ టీడీపీ, వైసీపీ, జనసేన చుట్టే తిరుగుతుండగా.. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని అంతా లైట్ తీసుకుంటూ వచ్చారు. కానీ పాల్ అడుగులు చూస్తుంటే ఆయన వ్యూహం వేరే ఉందన్న విషయం అర్థమవుతోంది. అనంతపురంలో ఆయన నిలబెట్టిన అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే ఆయన టార్గెట్ ఎవరో తెలుస్తుంది. అనంతపురం జిల్లాలో ప్రజాశాంతి పార్టీ తరుపున బరిలో నిలిపిన అభ్యర్థులంతా వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలి ఉండటం గమనార్హం.

ka paul 27032019

కేఏ పాల్ ఏరి కోరి మరీ వైసీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న వ్యక్తులనే ఎన్నికల్లో నిలిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, అనంతపురం అర్బన్, కల్యాణదుర్గం, రాప్తాడు, పెనుకొండ, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్నవారే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ తరుపున బరిలో దిగారు. అటు ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థి పేరుతో ఉన్న అభ్యర్థినే ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది.వైసీపీ తరుపున ఇక్కడి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్లు పోటీ చేస్తుండగా.. ప్రజాశాంతి పార్టీ తరుపున కూడా అదే పేరుతో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వర్లు పోటీకి సిద్దమయ్యారు. పెనుగొండలో ఎం శంకర్ నారాయణ వైసీపీ, ఎస్ శంకర్ నారాయణ ప్రజా శాంతి పార్టీ, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి తరఫున పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డిని బరిలో నిలబెట్టారు.

ka paul 27032019

ఉరవకొండలో వైసీపీ తరపున విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తుంటే, విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి పాల్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కల్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉషా శ్రీచరణ్, ప్రజా శాంతి నుంచి ఉషారాణి నామినేషన్ వేశారు. రాప్తాడు నుంచి వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ప్రజాశాంతి నుంచి డీ ప్రతాప్ బరిలో ఉన్నారు. అనంతపురం అర్బన్‌లో వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి పోటీ చేస్తుండగా, ప్రజా శాంతి పార్టీ నుంచి పగిడి వెంకరామిరెడ్డి నామినేషన్ వేశారు. ప్రజాశాంతి పార్టీ చేస్తున్న రాజకీయంపై వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. కేఏ పాల్ ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ది చేకూర్చేందుకే ఈ కుయుక్తులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. అంతేకాదు, వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండేలా ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తు తెచ్చుకోవడం.. వైసీపీ కండువాలను తలపించే కండువాలతోనే ప్రచారం చేస్తుండటం.. ఇదంతా తమ పార్టీని దెబ్బ తీయడానికి చంద్రబాబు ఆడిస్తున్న నాటకం అని ఆరోపణలు చేస్తోంది. అయితే కేఏ పాల్ కూడా ఏ మాత్రం తగ్గటం లేదు. మా పార్టీ 2008లోనే పెట్టామని, మా పార్టీ గుర్తు, రంగులు జగనే కాపీ కొట్టారని పాల్ అంటున్నారు. హెలికాప్టర్ గుర్తు ఈసీ ఇచ్చినందని, మా పార్టీతో పోలిన వ్యక్తుల పర్లే జగన్ పెట్టారని, నేనే రివర్స్ కంప్లైంట్ ఇస్తానంటూ, పాల్ చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read