సూళ్లూరుపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభావేదిక సమీపంలో రెండు కత్తులు పోలీసుల కంటపడటంతో ఆందోళనకు గురైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో చెంగాళమ్మ గుడికి సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
బహిరంగ సభావేదిక సమీపంలోని గోశాలవద్ద వాహనాలు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ఇద్దరు వ్యక్తులు ఓ బైక్పై గోశాలవద్దకు వచ్చి బారికేడ్ల వద్ద బైక్ అదుపు చేయలేక కిందపడ్డట్లు సమాచారం. దీంతో వారి వద్ద ఉన్న రెండు పొడవాటి కత్తులు కిందపడాయని తెలిసింది. అక్కడే ఉన్న పోలీసులు కిందపడిపోయిన బైక్ను కత్తులను చూసి ఆందోళన చెందారు. వెంటనే వారిని చుట్టుముట్టి ఆ ఇద్దరి వ్యక్తులను, కత్తులను అదుపులోకి తీసుకొని వారిని పోలీస్ స్టేషన్కు హుటాహుటిన తరలించినట్లు సమాచాం. ఈ విషయం చర్చనీయాంశమైంది.
కత్తులు కలిగిన ఇద్దరు వ్యక్తులు చిత్తూరు జిల్లా వాసులని, ఓ కేసులో వీరు ముద్దాయిలని, వారు తలదాచుకునేందుకు సూళ్లూరుపేటలోని బంధువుల ఇంటికి వస్తూ ఇలా పట్టుపడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు వీరి నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో పడినట్లు సమాచారం. ముఖ్యమంత్రి బహిరంగసభకు మరి కొద్ది నిమిషాల్లో వస్తున్నారనగా ఇలా ఇద్దరు వ్యక్తులు కత్తులతో పట్టుపడటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సమయంలో, ఈ వార్త బయటకు రావటంతో, తెలుగుదేశం క్యాడర్ షాక్ అయ్యింది. ఒక పక్క, వైసీపీ, పోలీసుల పై కక్ష సాధిస్తూ, సియం భద్రత చూసే, ఇంటలిజెన్స్ అధికారి బదిలీ అవ్వటం, ఇవన్నీ చూసి కంగారు పడుతున్నారు. అయితే, చంద్రబాబు బధ్రతకు వచ్చే ముప్పు ఏమి లేదని, అప్రమత్తంగా ఉన్నామని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి.