ఎన్నికలు మొదలైతే చాలు, ఐటి దాడులు కూడా మొదలవుతాయి. అది కూడా కేంద్ర పెద్దలు, ఎవరి మీద అయితే కోపంగా ఉంటారో, వారి మీదే జరుగుతాయి. కర్ణాటక ఎన్నికల్లో చూసాం, మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కూడా చూసాం. తెలంగాణా ఎన్నికల సమయంలో అయితే, తెలుగుదేశం నాయకలు కాంగ్రెస్ తో కలిసారు అనే కక్షతో, వరుస పెట్టి, అందరి పై దాడులు చేపించారు. వేల కోట్లు దొరికాయి అంటూ, మీడియాలో హడావిడి చేసి, చివరకు పది రూపాయలు కూడా అవినీతి జరిగినట్టు అధికారికంగా చెప్పలేదు. ఎందుకు చేస్తున్నారో చెప్పారు, ఏమి పట్టుకున్నారో చెప్పరు, చివరకు కేసు ఏమైందో తెలియదు, ఇలా ఐటి దాడుల స్టొరీ నడిచింది. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వస్తూ ఉండటంతో, మళ్ళీ దాడులు మొదలు పెట్టారు.
నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ కార్యాలయం, మంత్రి నారాయణ నివాసంలో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు నాలుగు బృందాలు కాలేజీ లోపలికి ప్రవేశించి కార్యాలయంలో, మంత్రి నారాయణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో అదీ ప్రచార సమయంలో ఈ దాడులు జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. మరోవైపు విజయనగరం జిల్లా చీపురుపల్లి సభలో చంద్రబాబు మాట్లాడుతూ నేడో, రేపో దాడులు జరిగే అవకాశముందని అనుమానం వ్యక్తం చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ దాడులు జరగడం కొసమెరుపు. ఈ దాడులపై మాత్రం మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటివరకైతే స్పందించలేదు.
మరో పక్క నిన్న, విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎయిమ్ విద్యాసంస్థల కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సంస్థ అధినేత కడగల ఆనంద్‌కుమార్ విద్యాసంస్థలతో పాటు బిల్డర్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన సంస్థలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. దాడుల సందర్భంగా విశాఖపట్నానికి చెందిన ఐటీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇది జరిగిన మరుసటి రోజే, ఏకంగా నారాయణ ఇంటి పైనే దాడులు చేసారు. తెలుగుదేశం పార్టీ నేతలు టార్గెట్ గా, రాబోయే రోజుల్లో, ఈ దాడులు మరింత ఉదృతం అవుతాయని తెలుస్తుంది.