తెలుగుదేశం ఈ సారి కొత్త ప్రయోగం చేస్తుంది. లోక్‌సభకు ఈసారి 15 మంది కొత్తవారిని టీడీపీ బరిలోకి దించింది. 10 మంది సిటింగ్‌ ఎంపీలకు మాత్రమే అవకాశమిచ్చింది. 25 స్థానాలకు పోటీచేసే అభ్యర్థులను టీడీపీ సోమవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసింది. పోటీ చేస్తున్న సిటింగుల్లో రామ్మోహన్‌నాయుడు(శ్రీకాకుళం), అశోక్‌ గజపతిరాజు(విజయనగరం), మాగంటి బాబు(ఏలూరు), కొనకళ్ల నారాయణరావు(మచిలీపట్నం), కేశినేని నాని(విజయవాడ), గల్లా జయదేవ్‌(గుంటూరు), రాయపాటి సాంబశివరావు(నరసరావుపేట), శ్రీరాం మాల్యాద్రి(బాపట్ల), నిమ్మల కిష్టప్ప(హిందూపురం), శివప్రసాద్‌(చిత్తూరు) ఉన్నారు. సిటింగ్‌ ఎంపీల్లో జేసీ దివాకర్‌రెడ్డి(అనంతపురం), మాగంటి మురళీ మోహన్‌(రాజమండ్రి) పోటీ నుంచి వైదొలిగారు. దివాకర్‌రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి, మురళీమోహన్‌ బదులు ఆయన కోడలు రూప పోటీ చేస్తున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు దివంగత నేతల వారసులు ఈసారి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. లోక్‌సభ స్పీకర్‌గా చేసి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్‌మాధుర్‌ అమలాపురం నుంచి, విశాఖకు పలు సార్లు టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసిన ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు భరత్‌ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.

కొత్త ముఖాల్లో ఇద్దరు మంత్రులు ఆదినారాయణరెడ్డి(కడప), శిద్దా రాఘవరావు (ఒంగోలు), ఎమ్మెల్యేలు డీకే సత్యప్రభ(రాజంపేట), వేటుకూరి శివరామరాజు(నరసాపురం) ఉన్నారు. టీడీపీలో చేరిన ముగ్గురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు కూడా జాబితాలో చోటుదక్కింది. అరకులో కిశోర్‌ చంద్రదేవ్‌, తిరుపతి నుంచి పనబాక లక్ష్మి, కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి పోటీచేస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆడారి ఆనంద్‌ అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నా రు. రాజకీయ కుటుంబానికి చెందిన మాండ్ర శివానందరెడ్డికి నంద్యాల లోక్‌సభ స్థానం లభించింది. కర్నూలు జిల్లాలో ఇటీవ ల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గౌరు దంపతులకు ఆయన సమీప బంధువు. పారిశ్రామికవేత్తలు చలమలశెట్టి సునీల్‌ కాకినాడ నుంచి, బీద మస్తాన్‌రావు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు. వీరిలో సునీల్‌ గత ఎన్నికల్లో అదే స్థానం నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన విశాఖ, నరసాపురం, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాల్లో టీడీపీయే బరిలోకి దిగింది. టీడీపీ అభ్యర్థుల్లో భరత్‌(విశాఖ), హరీశ్‌(అమలాపురం), రూప(రాజమండ్రి), పవన్‌రెడ్డి(అనంతపురం), రామ్మోహన్‌నాయుడు (శ్రీకాకుళం) యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వీరిలో భరత్‌ తమ కుటుంబానికి చెందిన గీతం విశ్వ విద్యాలయం వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఆయన సినీ హీరో నందమూరి బాలకృష్ణకు చిన్నల్లుడు. ఈ కారణంగానే ఆయ న్ను తొలుత పక్కనపెట్టారు. కానీ ఆ లోక్‌సభ స్థానం పరిధిలో ని ఎమ్మెల్యేలంతా గట్టిగా కోరడంతో చోటు కల్పించారు. రూప గతంలో కన్సల్టెంట్‌గా శ్రీలంక అధ్యక్షుల వద్ద పని చేశారు. పవన్‌ కుటుంబ వ్యాపారాలు చూసుకుంటున్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న వారిలో భరత్‌, ఆనంద్‌, హరీశ్‌, రూప, శివానంద రెడ్డి, పవన్‌ రెడ్డి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆదినారాయణరెడ్డి, శిద్దా, సత్యప్రభ, శివరామరాజు, మస్తాన్‌రావు ఎంపీలుగా పోటీ చేయడం ఇదే ప్రథమం. టీడీపీ తరపున ఎంపీలుగా పోటీ చేస్తున్న వారిలో కిశోర్‌ చంద్రదేవ్‌ అత్యంత సీనియర్‌. ఆయన అరకు నుంచి ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read