ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో దాఖలు చేసిన నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నారా లోకేశ్ నామినేషన్‌పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేశ్ గుంటూరు జిల్లా పరిధిలో నివాసం ఉంటూ కృష్ణా జిల్లా నోటరీ చేత నోటరీ చేయించారని ఆయన ఆరోపించారు. నోటరీ రూల్స్ 1956, 8,8ఏ మరియు 9 ప్రకారం నామినేషన్ ఫారమ్ 26 చెల్లదని ఆళ్ల పేర్కొన్నారు. అయితే, సరైన పత్రాలు సమర్పించేందుకు నారా లోకేశ్ కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి 24 గంటలు గడువు ఇచ్చారు. లోకేశ్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ స్థానంలో బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
ఇక, చిత్తూరు జిల్లా పీలేరు వైసీపీ వర్గీయుల్లో టెన్షన్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ ఇంకా పెండింగ్ లో ఉండటమే దానికి కారణం. నామినేషన్ పత్రాలతో పాట నో డ్యూస్ సర్టిఫికెట్లను ఇవ్వని కారణంగా నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి పెండింగ్ లో ఉంచారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నో డ్యూస్ సర్టిఫికెట్స్ పై ప్రత్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్నికల అధికారికి తాను వివరణ ఇచ్చానని... తన సమాధానంపై ఎన్నికల అధికారి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.
మరో పక్క, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. టీడీపీ నేత జలీల్ ఖాన్ కుమార్తె, టీడీపీ అభ్యర్థి షబానా ఖాతూన్ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. షబానాకు అమెరికా పౌరసత్వం ఉన్న కారణంగా ఆమె నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే షబానాకు ఎలాంటి విదేశీ పౌరసత్వం లేదని... రిటర్నింగ్ అధికారి రాజేశ్వరి తెలిపారు. షబానా నామినేషన్ ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా, ఇప్పుడు ఎన్నికల కంటే ముందే, ఎవరి నామినేషన్ చెల్లుతుంది, ఎవరిది చెల్లదు అనేది సస్పెన్స్ గా మారింది.