సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధిపతి మోహన్ బాబు, ఆయన కొడుకుల ట్విట్టర్ రాతల పై ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు మరోసారి విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోహన్ బాబు వంతపాడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం తన విద్యా సంస్థల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదంటూ సినీనటుడు మోహన్‌బాబు శుక్రవారం తిరుపతిలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోహన్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మోహన్‌బాబుకి కౌంటర్ ఇవ్వడం, కుటుంబరావుకి మంచు మనోజ్ ఆధారాలతో సహా ప్రశ్నలు సంధించడం జరిగాయి. దీంతో శనివారం మీడియాతో మాట్లాడిన కుటుంబరావు మోహన్‌బాబు కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు.
‘మోహన్‌బాబు ఫ్యామిలీలో అందరూ నటులే. రాష్ట్రంలో ఇంతకంటే పచ్చి అబద్ధాలు చెప్పే కుటుంబం మరొకటి లేదు. మీ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించి.. వారి పేరిట ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసి సొమ్ము చేసుకుంటున్నది మీరు కాదా? మేనేజ్‌మెంట్ సీట్ల పేరుతో విద్యార్థుల నుంచి ఏడాదికి 5-6 లక్షల రూపాయాలు వసూలు చేస్తోంది మీరు కాదా? సమాధానం చెప్పండి. విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలుచేస్తూ లెక్చరర్స్‌కి మాత్రం తక్కువ వేతనాలు ఇస్తున్నారు. మీరు విద్య పేరుతో వ్యాపారం చేస్తున్నారు. కేవలం రాజకీయ కోణంలోనే మోహన్‌బాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ అని అందరూ అనుకుంటున్నారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేద్దామనుకుంటే మీకే నష్టం. మీ బంధువైన వైఎస్ జగన్‌కు మేలు చేసేలా ఎన్నికల సమయంలో ఈ ఆందోళన ఎందుకు చేపట్టారు. ముసుగు తీసేసి వైసీపీ తరపున ప్రచారం చేసుకుంటే మిమ్మల్ని ఆపేదెవరు. మోహన్‌బాబు వారం రోజులుగా చెవిరెడ్డి అనే క్రిమినల్‌తో తిరుపతిలో తిరుగుతున్నారు. దీనికి ఏం సమాధానం చెబుతారు. పద్మశ్రీ వచ్చిన మహానటులు చాలామంది ఉన్నారు. కానీ మోహన్‌బాబు లాంటి నటుడికి ఆ పురస్కారం వచ్చినందుకు ఈరోజు బాధగా ఉంది.’ అని కుటుంబరావు ధ్వజమెత్తారు.
మోహన్ బాబు ఎంత పెద్ద నటుడో తనకైతే తెలియదని, పద్మశ్రీ ఇచ్చారు కాబట్టి పెద్ద నటుడే అయ్యి ఉంటారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. పద్మశ్రీ వచ్చిన మహానటులు చాలా మంది ఉన్నారని, కానీ మోహన్ బాబుకు వచ్చినందుకు బాధపడుతున్నానని చెప్పారు. మోహన్ బాబుకు డాక్టర్ రేట్ కూడా ఉందట అని అంటూ తనకైతే తెలియదని అన్నారు. మోహన్ బాబు విద్యను వ్యాపారంగా మార్చారని ఆయన విమర్శించారు. బిల్డింగ్ ఫీజులు, డొనేషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తు్నారని ఆయన ఆరోపించారు. లెక్చరర్లకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని అన్నారు. కేవలం రాజకీయాల కోసమే మోహన్ బాబు డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. మీ కాలేజీలో విద్యాశాఖతో విచారణకు సిద్ధమా అని ఆయన మోహన్ బాబుకు సవాల్ విసిరారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల బయట ఉన్న హోటల్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అమ్మే షాపుల వద్ద నుంచి కూడా గుడ్ విల్ తీసుకుంటున్నారని ఆ సంస్థల యాజమాన్యంపై కుటుంబరావు ఆరోపించారు. తమ విద్యా సంస్థల వల్లే ఈ హోటల్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ కు వ్యాపారం జరుగుతోంది కనుక తమకు గుడ్ విల్ ఇవ్వాలని వారు అన్నట్టు ఆరోపణలు వచ్చినట్టు చెప్పారు. ముందు, మీ క్రెడిబులిటీ ఏంటో నిరూపించుకోండి? అని హితవు పలికారు. తమపై బురదజల్లాలని చూస్తే కుదరదని, మంచు కుటుంబం అంటే ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని కుటుంబరావు సూచించారు.