దొంగ ఓట్లను తొలగించాలని తామే ఫామ్-7 దరఖాస్తులు ఇచ్చామని గొప్పగా చెప్పిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఓటుకే ఎసరొచ్చింది. తన ఓటును తొలగించాలని ఆయనే దరఖాస్తు చేసినట్లుగా ఎన్నికల అధికారికి ఆన్లైన్లో ఫామ్-7 ద్వారా ఒక వినతి అందింది. పులివెందుల ఎన్నికల అధికారి(ఆర్వో) సత్యం మంగళవారం విలేకరులకు వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి. ‘పులివెందులలోని 134 బాకరాపురం పోలింగ్ కేంద్రంలో జగన్‌కు ఓటు హక్కు ఉంది. ఈ ఓటును తొలగించాలని జగనే స్వయంగా దరఖాస్తు చేసుకున్నట్లు ఫామ్-7లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు వచ్చింది. దీనిని చూడగానే జగన్ బంధువైన జనార్దన్‌రెడ్డికి సమాచారం ఇచ్చాం. ఆయన జగన్ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణమోహన్ రెడ్డికి తెలియజేశారు’ అని ఆర్వో వివరించారు.
అయితే ఓటు తీసేయాలని తాను ఫామ్-7 దరఖాస్తు చేయలేదని జగన్ బదులిచ్చారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులెవరో ఈ పని చేశారని భావించి, కలెక్టర్ హరికిరణ్‌కు ఆర్వో సమస్యను నివేదించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పులివెందుల పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. తాను ఆన్లైన్లో ఫామ్-7 దరఖాస్తు చేయలేదంటూ లిఖితపూర్వకంగా బదులివ్వాలని జగన్‌కు స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్‌కు నివేదించినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో పక్క, జగనే ఈ ప్రచారం కావాలని చేస్తున్నట్టు తెలుగుదేశం చెప్తుంది. దోచుకోవడానికే జగన్ పార్టీలోకి పారిశ్రామిక వేత్తలు వెళ్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.
కేసీఆర్‌కు జగన్ దత్త పుత్రుడు అని ఆరోపించారు. మోదీ.. జగన్ అవినీతికి కాపలాదారుని విమర్శించారు. జగన్‌ను కాపాడాలని సీబీఐకి మోదీ ఆదేశాలిచ్చారని చెప్పారు. జగన్ నుంచి మోదీకి ఎన్ని ముడుపులు అందాయో చెప్పాలన్నారు. జగన్ మీద ఎంక్వైరీ ఎందుకు వేయలేదని అడిగారు. పులివెందులలో జగన్ ఓటు తొలగించాలని ఫామ్-7 దరఖాస్తు ఇచ్చారనేది అబద్ధం అన్నారు. జగన్ పాస్‌పోర్ట్ మీద ఎక్కడ అడ్రస్ ఉంది.. ఓటు ఎక్కడ నమోదు చేసుకున్నారన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే తన ఓటు కూడా పోయిందని జగన్ అబద్ధం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.