మన రాష్ట్రంలోని రైతులే కాదు, మన రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా, చంద్రబాబు విధానాలని పొగుడుతూ, ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈరోజు ప్రముఖ కన్నడ దినపత్రిక "ప్రజావాణి" ఒక వార్తను ప్రచురించింది. " ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా అనంతపురం జిల్లా గొల్లపల్లి జలాశయాన్ని నింపి తద్వారా కాలువల మూలకంగా హిందూపురం ప్రాంతంలోని చెరువులను నింపడం ద్వారా సరిహద్దు ప్రాంతమైన మా కర్ణాటకలోని గౌరిబిదనూరు తాలూకాలోని గ్రామాల బావుల్లో కూడా భూగర్భ జలాలు పెరగడంతో బెంగళూరుకు వలసవెళ్లిన ఆ ప్రాంత ప్రజలు తిరిగి స్వగ్రామాలకు మళ్లుతున్నారు" అంటూ వార్తను ప్రచురించింది.
అవి ఎనభైల నాటి రోజులు. శ్రీశైలం జలాలను కరవు సీమకు మళ్లించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కోసం క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు సర్వే చేస్తున్న సమయం. ప్రముఖ ఇంజినీరింగు నిపుణుడు శ్రీరామకృష్ణయ్య ఈ కృషిలో భాగస్వాములయ్యారు. అందరూ వారిని చూసి ఈ రాళ్ల సీమలో నీళ్లు పారిస్తారా అంటూ నవ్వుకునేవారట. శ్రీరామకృష్ణయ్య శిష్యుడిగా పేరొందిన విశ్రాంత ఇంజినీరు కంభంపాటి పాపారావు ఈ సంగతులు చెబుతుంటారు. ఇప్పుడు ఆ కరవు జిల్లా రైతులు కిలోమీటర్ల దూరం కాలువ వెంబడి నడిచి .. ప్రవహిస్తున్న నీళ్లను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కరవు సీమ కదిరి సమీప ప్రాంతాలకు కూడా కాలువల నీళ్లు ప్రవహిస్తున్నాయి. నిరంతరం ప్రవహిస్తున్న కాలువల నీళ్లు...సమీప జలాశయాల్లో నిలబెట్టిన నీళ్లు... అనేక గ్రామాల్లో భూగర్భజలాలను సుసంపన్నం చేస్తున్నాయి. నీటికి ఒక భరోసా ఏర్పడింది. ఒక్క వర్షాధారమే కాదు...కాలువల ఆధారంగాను కాసిన్ని నీళ్లు గొంతులు నింపుతాయని, ఇంకా అవకాశం ఉంటే పొలాలు తడుపుతాయనే విశ్వాసం పాదుకుంది. కృష్ణమ్మతో నిండిన చెరువులు, జలాశయాల చెంత ఇప్పుడు పచ్చదనం సంతోషాల సంక్రాంతి చేస్తోంది.
కరవుతో అతలాకుతలమవుతున్న సీమలో కొన్ని ప్రాంతాలను కృష్ణా జలాలు సుసంపన్నం చేశాయి. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాక సాగులో నానా అవస్థలు పడుతున్న రైతాంగం కాసింత ఉపశమనం పొందారు. అనంతపురం, కడప జిల్లాల్లో అనేక జలాశయాలు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. హంద్రీనీవా సుజల స్రవంతి పరుగులు తీస్తూ చెర్లోపల్లి జలాశయాన్ని నింపి చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టింది. గాలేరు నగరి అవుకు టన్నెలు దాటి గండికోటను సుసంపన్నం చేసి మరిన్ని జలాశయాలకు చేరింది. చెరువులు నీటితో నిండి దాహార్తి తీరుస్తున్నాయి. భూగర్భ జలమట్టాలు పెరిగి భవిష్యత్తుకు భరోసా కలిగిస్తున్నాయి. ట్యాంకర్లపైన ఆధారపడి నీటి అవసరాలు తీర్చుకునే ప్రాంతాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చీనీ, అరటి తోటలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. కరవు కష్టాలను తీర్చిన కృష్ణమ్మ అన్నపూర్ణగా తన పేరు సార్థకం చేసుకుంది.