జగన్ కేసుల్లో సుమారు రూ.46,500 కోట్లకు సంబంధించిన అక్రమాస్తులు/పెట్టుబడులపై సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇది అంతటితో ఆగలేదని... సీబీ‘ఐ’ గుర్తించని మరిన్ని అక్రమాలు ఉన్నాయని ఈడీ తేల్చింది. హిందూజా సంస్థలకు చేసిన మేళ్లకు ప్రతిఫలంగా... విజయసాయిరెడ్డి బినామీ కంపెనీగా భావిస్తున్న ‘యాగా అసోసియేట్స్’కు రూ.177 కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేశారని తేల్చింది. ఇక... ఇందూ ప్రాజెక్ట్స్‌కు చెందిన ‘మ్యాక్’ అనే సంస్థ పురుడు పోసుకోకముందే వైఎస్ నుంచి భూములు పొందిందని నిర్ధారించింది. ఇవి రెండూ ‘క్విడ్ ప్రో కో’ పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది. అలాగే... సీబీఐ తన ఎఫ్ఐఆర్లో 73 మందిని నిందితులుగా పేర్కొని... 28 మంది/సంస్థల విషయంలో క్విడ్‌ప్రోకో జరిగిందనే వాదనలతో ఈడీ ఏకీభవించలేదు. స్వయంగా సీబీఐ చార్జిషీట్లో నమోదు చేసిన అభియోగాలనే గుర్తు చేస్తూ... ‘మీరు చెప్పింది నిజం కాదు’ అని ఈడీ సూటిగా చెప్పింది.
మోదీ చుట్టూ వైసీపీ... ‘‘అవినీతి విశృంఖలంగా జరిగింది. క్విడ్‌ప్రోకోలో మీరు చూడని లోతులున్నాయి. ఇవిగో ఆధారాలు... మళ్లీ సమగ్రంగా విచారించండి. త్వరగా నివేదిక ఇవ్వండి. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఈడీ కోరి దాదాపు రెండేళ్లు గడిచిపోయాయి. అయినా దీనిపై సీబీఐ నుంచి ఉలుకూ పలుకూ లేదు. జగన్‌ను అదుపాజ్ఞల్లో ఉంచుకునేందుకు కేంద్రం దీనిని వాడుకుందని... కొత్త చిక్కులు తెచ్చుకోకుండా మోదీకి జగన్ దాసోహమయ్యారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అసలే కేసుల దెబ్బకు కేంద్రానికి అణిగిమణిగి ఉంటున్న వైసీపీ... 2017 మే నెలలో ఈడీ రాసిన లేఖ దెబ్బకు మరింత విలవిలలాడిందని, ఇంకా లోతుగా విచారిస్తే. మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయని బెంబేలెత్తిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో, విజయ సాయిరెడ్డి ప్రధాని కార్యాలయం చుట్టూ అనేకమార్లు ప్రదక్షిణలు చేయడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు లోపల, బయట కూడా పలుమార్లు ప్రధాని మోదీని కలిసి ప్రసన్నం చేసుకునేందుకు ఆయన తహతహలాడటం గమనార్మం.
ఒకవైపు... మోదీ సర్కారుపై టీడీపీ యుద్ధం ప్రకటించగా... అనేక విషయాల్లో వైసీపీ మోదీకి అనుకూలంగా వ్యవహరించింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అడగకుండానే మద్దతు ఇచ్చింది. పార్లమెంటులో, బయటా ఎప్పుడూ... ఎక్కడా మోదీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హోదా గురించి ఎప్పుడూ నిలదీయలేదు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఉన్నప్పటికీ... లేనట్లుగానే వ్యవహరించారు. హోదాపై చర్చలో పాల్గొన్నప్పుడు కూడా... ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలేసి, చంద్రబాబుపైనే విమర్శలు గుప్పించారు. ఇదంతా కేసుల భయంవల్లే అని టీడీపీ మొదటి నుంచీ విమర్శిస్తోంది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా తాము దర్యాప్తు జరుపుతుండగా... మరో రెండు ‘క్విడ్ ప్రో కో’లు బయటపడినట్లు ఈడీ తెలిపింది. హిందూజా గ్రూప్ కంపెనీకి చెందిన గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐడీఎల్ ఇండస్ర్టీస్ లిమిటెడ్‌లకు చెందిన వంద ఎకరాల స్థలం ఇండస్ర్టియల్ జోన్లో ఉంది. దీన్ని వైఎస్ సర్కారు రెసిడెన్షియల్ జోన్‌గా మార్చింది. అలాగే... విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం పాలవలసలోని హిందూజా థర్మల్ విద్యుత్ ప్లాంట్ పునరుద్ధరణకు అనుమతి ఇచ్చింది. దీనికి ‘ప్రతిఫలం’గా జగన్‌కు చెందిన యాగా అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 11.10ఎకరాలను హిందూజా సంస్థ కట్టబెట్టినట్లు ఈడీ గుర్తించింది. అప్పట్లోనే దీని మార్కెట్ విలువ రూ.177.60కోట్లుగా తెలిపింది.