Sidebar

16
Sun, Mar

వంగవీటి రాధాకృష్ణ బుధవారం టీడీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని చెప్పారు. విజయవాడలో పేద ప్రజలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. అందుకే టీడీపీకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. తన వ్యక్తిగత ప్రతిష్ట గురించి కాకుండా పేదల కోసం నిందలు మోయడానికి సిద్ధపడి అడుగులేస్తున్నానని వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. నియంత చేతుల్లోకి రాష్ట్ర ప్రజల భవిష్యత్ వెళ్లకుండా ఉండేందుకు తన వంతు కృషి చేస్తానని జగన్‌ను ఉద్దేశించి రాధా పరోక్ష విమర్శ చేశారు. రాధా ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధా టీడీపీలో చేరిక ఖాయమైంది. వైసీపీకి రాజీనామా చేసిన ఐదు నెలల తర్వాత ఆయన తన నిర్ణయాన్ని మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా తొలుత కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేశారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు.

modi 12032019

ఈ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రాధా భావించారు. అయితే, రాధాకు టికెట్‌ ఇవ్వలేమని వైసీపీ అధిష్ఠానం ఆరు నెలల క్రితమే తేల్చి చెప్పేసింది. సెంట్రల్‌ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా మల్లాది విష్ణును నియమించింది. వైసీపీ అధిష్ఠానం ధోరణి.. పొమ్మనకుండా పొగబెట్టినట్లు ఉండటంతో రాధా ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది అక్టోబరులో రాజీనామా చేశారు. ఈ ఏడాది జనవరిలో విలేకరుల సమావేశం నిర్వహించిన రాధా.. వైసీపీలో తనకు ఎదురైన అవమానాలను వెల్లడించారు. తన తండ్రి రంగా అంటే వైసీపీ అధినేత జగన్‌కు ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాధా వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీ నేతలు పలుమార్లు ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాలపై స్పందించిన రాధా తన అనుచరులు, రాధా-రంగా మిత్రమండలి సభ్యులతో పలుమార్లు చర్చించారు. భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవ్వడంతో కొద్దిరోజులపాటు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

modi 12032019

చివరికి తన సన్నిహితుల సూచన మేరకు సోమవారం అర్ధరాత్రి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి టీడీపీలో చేరాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, వైసీపీని ఓడించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తరఫున ప్రచారం నిర్వహిస్తానని చంద్రబాబుతో రాధా పేర్కొన్నట్లు సమాచారం. వైసీపీలో తనకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని, అనూహ్యరీతిలో టీడీపీ నుంచి తనకు మంచి ఆదరణ లభించిందని రాధా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. టీడీపీకి తోడు ఉంటా.. ప్రస్తుత ఎన్నికలు అరాచకానికి.. అభివృద్ధికి, అహంకారానికి.. అనుభవానికి మధ్య జరుగుతున్నాయని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని టీడీపీకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాధా ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ఈ ప్రకటనలో టీడీపీలో తాను చేరడానికి గల కారణాలను వివరించారు. ప్రజల భవిష్యత్తు నియంతృత్వం కలిగిన వ్యక్తి చేతుల్లో పడకుండా చూడాలన్న లక్ష్యంతోనే తాను టీడీపీ వైపు మొగ్గు చూపానన్నారు. బెజవాడ నగరంలో ప్రతిసామాన్యుడికీ ఇళ్ల పట్టాలు అందించాలన్న తన తండ్రి దివంగత రంగా ఆశయాలను సఫలీకృతం చేసిన చంద్రబాబుకు రాధా కృతజ్ఞతలు తెలిపారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read