పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ టికెట్ విషయంలో అధిష్ఠానానికి తన వాదన వినిపించేందుకు భార్యతో కలసి హైదరాబాదులోని లోట్‌సపాండ్‌లో వున్న వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ఆయనకు లోపలకు అనుమతి అనుమతి లభించలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గేటు బయట వేచివున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని పూతలపట్టు నియోజకవర్గంలో వేరొకరికి సీటు ఇస్తున్నారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతుండడంతో అధిష్టానం వద్ద్దే తేల్చుకుందామని సునీల్‌కుమార్ మంగళవారం లోట్‌సపాండ్‌కు చేరుకున్నాడు. మామూలుగా అయితే పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంది. సునీల్‌తో పాటు వచ్చిన ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, నాయకులను లోనికి అనుమతించిన సెక్యూరిటీ సునీల్‌ను మాత్రం లోనికి వెళ్లకుండా అడ్డుకుంది.
దీంతో పార్టీ అధినేత జగన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ తనకు తెలిసిన వారి ద్వారా సమాచారాన్ని లోపలికి పంపేందుకు పలుమార్లు ప్రయత్నించిన సునీల్ విఫలమైనట్లు సమాచారం. జిల్లా పార్టీ వ్యవహారాలను చూస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోపలకు వెళుతూ సునీల్‌కుమార్ వంక చూసీచూడనట్లు వెళ్లిపోవడంతో ఆయన మరింత ఆవేదనకు గురైనట్లు తెలిసింది. తనకు జరిగిన అవమానాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఓ దేశలో ఆయన కంటినుంచి నీరు రావడం.. ఆయన అనుచరులను కలచివేసింది. కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా.. సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకే అన్యాయం చేస్తే ఎలా..? అంటూ ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. తన ఆవేదనను మంగళవారం రాత్రి ఆయన ఫేస్‌బుక్ లైవ్ ద్వారా పూతలపట్టు వైసీపీ కార్యకర్తలకు వివరించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారో.. ఆయన మాటల్లోనే..
‘పూతలపట్టు వైసీపీ కార్యకర్తలకు అభిమానులతో కొన్ని విషయాలను నేను పంచుకోవాలనుకుంటున్నాను. 2014కు ముందు నేను ఎవరినో మీకు తెలీదు. కానీ నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించారు. నాకు సీటు ఇప్పించిన వారికిగానీ.. వైసీపీకి కానీ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులను తేలేదు. నా ప్రవర్తనతో జగన్‌కు కూడా ఎలాంటి చెడ్డ పేరు తేలేదు. కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ అని ఏదేదో అంటున్నారు. ఎవరినీ కలవలేదంటున్నారు. కానీ పార్టీ అంటే నాకు విపరీతమైన అభిమానం.. పిచ్చి.. కొన్ని పరిస్థితుల వల్ల టికెట్ రావచ్చు.. రాకపోవచ్చు.. టికెట్ రానివ్వండి.. రాకపోనీయండి.. మీ అందరి మనిషిగా ఉంటే చాలు.. మనతో పాటు అయిదేళ్లు కలిసి బతికాడు.. అని గుర్తుంచుకుంటే చాలు.. పింఛన్లు రానివాళ్లను చూసినా.. రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం వస్తే అందరికీ మంచి చేయాలని అనుకున్నా.. ఎమ్మెల్యే అయ్యాక ఏదో ఒక మంచి పని చేసి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆశ ఉండేది. కానీ ఆ అవకాశం నాకు మళ్లీ వస్తుందో.. లేదో తెలీదు. దేవుడు ఆశీస్సులు ఉంటే నా కల నెరవేరుతుంది...’.. అని సునీల్ కుమార్ కన్నీటిపర్యంతమయ్యారు.