ఎన్నికల టికెట్ల వ్యవహారం వైసీపీలోనూ కాక పెంచుతోంది. సీటుపై గ్యారెంటీ లేని నేతలు, అనుచరులు హైదరాబాద్‌కు క్యూ కట్టారు. లోటస్ పాండ్ ఎదురు ఆందోళనలకు దిగారు. మంగళవారం జగన్ నివాసం దగ్గర ఇదే సీన్ కనిపించింది. ఉరవకొండ అసెంబ్లీ టికెట్‌ను శివరామిరెడ్డికి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. లోటస్‌పాండ్ దగ్గర బ్యానర్లతో నినాదాలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని.. ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. శివరామిరెడ్డి అనుచరులు జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి కారును కూడా అడ్డగించారు. బాపట్ల నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు కూడా నిరసనకు దిగారు.
కావాలి జగన్.. రావాలి జగన్.. వెళ్లాలి కోన అంటూ ఎమ్మెల్యే రఘుపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డికి సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. రెబల్స్ బెడద వైసీపీకి కూడా తప్పేలా లేదు. ఇటు అసంతృప్త నేతల్ని బుజ్జగించేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి రంగంలోకి దిగారు. ఇది ఇలా ఉంటే, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వాహనాన్ని వైసీపీ శ్రేణులు మంగళవారం అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వర్‌రెడ్డికి ఇవ్వొద్దంటూ.. లోటస్‌పాండ్ వద్ద శివరామిరెడ్డి అనే మరో వైసీపీ నేతతోపాటు ఆయన అనుచరులు నినాదాలు చేశారు.
ఆ సమయంలో లోటస్‌పాండ్ వద్దకు వచ్చిన జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకానందరెడ్డి వాహనాన్ని శివరామిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. కాగా... విశ్వేశ్వర్‌రెడ్డికి టికెట్ ఇస్తే ఓడిపోతామని, సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతామని ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు కార్యకర్తలు పేర్కన్నారు. మరో పక్క, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కు చేదు అనుభవం తప్పలేదు. ఈసారి తనకు సీటు దక్కకపోవచ్చనే ఊహాగానాలు రావడంతో సునీల్ అప్రమత్తమయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం లోటస్‌పాండ్‌కు వచ్చారు. రెండు గంటలపాటు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అప్పుడే మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ నివాసం దగ్గరకు రాగా.. సునీల్ ఎదురుపడినా పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు. రామచంద్రారెడ్డి చూసీ చూడనట్లు వ్యవహరించడంతో సునీల్ మనస్తాపంతో ఉన్నారు.