మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు ఉండి ఆక్టివ్ అయ్యారు. పోయిన వారం ఆయన అటు స్పీకర్ కోడెలతోనూ, ఇటు వంగవీటి రాధాతోనూ వేర్వేరుగా సమావేశం అయ్యారు. రాజకీయవర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో ఆయన టీడీపీ అధినేతతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. పలు మార్లు భేటీ అయ్యారు కూడా. భేటీ అయినప్పుడల్లా ఆయన టీడీపీలో చేరుతారని, ఏదో ఓ స్థానం నుంచి పార్లమెంట్‌కో అసెంబ్లీకో పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు నేరుగా కోడెల, వంగవీటి రాధాలను కలవడం దేనికోసమన్న చర్చ ప్రారంభమయింది.
వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేశారు కానీ, ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. తెలుగుదేశం పార్టీ ఆహ్వానించినా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఆఫర్ ఆయనకు నచ్చలేదంటున్నారు. కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. ఈ తరుణంలోనే లగడపాటి రాజగోపాల్ ఆయనను టీడీపీ తరపున విజయవాడ నుంచి కాకుండా ఇతర చోట్ల పోటీ చేసేందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరడంతో నర్సాపురం టిక్కెట్ ఒకటి పెండింగ్‌లో ఉంది. అక్కడ క్షత్రియ సామాజికవర్గంతో పాటు కాపు సామాజికవర్గానికి కూడా రాజకీయ పార్టీలు అవకాశం కల్పిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాలో ఓ చోట నుంచి పోటీ చేయాలని లగడపాటి వంగవీటికి సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.
అయితే, ఈ నేపధ్యంలో లగడపాటి కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేస్తారు అనే టాక్ వినిపిస్తూ వస్తుంది. దీని పై లగడపాటి స్పందించారు. ‘నా రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తా.., ఏ పార్టీలో చేరను, వ్యాపారాలు చేసుకుంటా’నని లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’నంటూ ప్రకటించిన ఆయన అదే మాటపై ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నారు. అయితే... ఇప్పడు సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆయన తన రాజకీయ సన్యాసాన్ని వదిలేసి ఏదైనా పార్టీలో చేరి పోటీచేస్తారా అన్న దానిపై అంతటా ఆసక్తి ఉండేది. అయితే ఈ విషయంపై మంగళవారం ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయ సన్యాసం కొనసాగిస్తానని ప్రకటించారు.