గుంటూరు జిల్లా టీడీపీలో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీ రాయపాటి అలకతో ఈ స్థానంపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. తనకు ఎంపీ టికెట్‌తో పాటు కుమారుడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నది రాయపాటి ప్రతిపాదన. అయితే.. జిల్లాలోని దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసిన పరిస్థితి. రాయపాటి లాంటి సీనియర్ నేతను వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఎవరిని పక్కన పెట్టి రాయపాటి కుమారుడికి టికెట్ ఇవ్వాలనే అంశంపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా మరో వాదన కూడా తెరపైకొచ్చింది.
నరసరావుపేట పార్లమెంట్ స్థానం సిట్టింగ్ నుంచి ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ, అధిష్టానం మాత్రం మరికొందరి పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, భాష్యం రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే నర్సరావుపేట లోక్‌సభ స్థానానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు పరిశీలనకు వచ్చింది. రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబును గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని ప్రతిపాదన కూడా టీడీపీ అధిష్టానం రాయపాటి ముందుంచినట్లు సమాచారం.
ఈ ప్రతిపాదనకు రాయపాటి అంగీకారం తెలిపితే.. గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసిన మద్దాల గిరిని... నర్సరావుపేట అసెంబ్లీకి పంపాలన్న యోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. ఆలపాటి నర్సరావుపేట లోక్‌సభకు పోటీ చేయనంటే... భాష్యం రామకృష్ణ పేరును పరిశీలించాలని టీడీపీ భావిస్తోంది. దీంతో రాయపాటి సాంబశివరావును ఎంపీ సుజనాచౌదరి పిలిపించి మాట్లాడిట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదన పట్ల తనకు ఆసక్తి లేదని రాయపాటి తేల్చి చెప్పినట్లు సమాచారం.