అనంతపురం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న టీడీపీ అభ్యర్థులను సోమవారం అర్ధరాత్రి తర్వాత సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి, గుంతకల్లు అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు, కదిరి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు అవకాశం కల్పించారు. శింగనమల, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో కొత్త వారిని రంగంలోకి దింపారు. శింగనమలలో బండారు శ్రావణి, కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వరనాయడు పేర్లను ప్రకటించారు. జిల్లాలో బలంగా ఉన్నా పోటీ తీవ్రంగా ఉండడంతో అధికార పార్టీ అభ్యర్థుల ఖరారులో జాప్యం జరిగింది. నాలుగు రోజుల క్రితమే సీఎం సూచనప్రాయ అంగీకారంతో 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వారివారి నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు. ఇందులో రాప్తాడు నుంచి మంత్రి పరిటాల శ్రీరామ్, రాయదుర్గం నుంచి మంత్రి కాలవ శ్రీనివాసులు, అనంతపురం నుంచి వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ, పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్, తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్‌రెడ్డి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, మడకశిర నుంచి ఈరన్న, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ ప్రచారానికి తమతమ ఏర్పాట్లు చేసుకున్నారు. హిందూపురం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. అప్పటి నుంచి మూడు స్థానాల్లో ప్రతిష్ట్ఠంభన నెలకొంది.
కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల స్థానాల్లో సిట్టింగులపై వచ్చిన సర్వేలు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ అభ్యర్థులను ఖరారు చేయడంలో సీఎం చంద్రబాబు మల్లగుల్లాలు పడ్డారు. గెలుపు గుర్రాల కోసం ఆరా తీశారు. పలుమార్లు ఆ స్థానాలకు ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించారు. ఆ మూడు చోట్లా సిట్టింగు ఎమ్మెల్యేలైన హనుమంతరాయ చౌదరి, యామినీబాల, జితేంద్రగౌడ్ తిరిగి తమకే అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. అమరావతిలోనే మకాం వేశారు. ఈ నే పథ్యంలో ఆ మూడు స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేయకుండా అధిష్ఠానం పెండింగ్‌లో పెట్టింది. ఇదే అదునుగా భావించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అమరావతికి చేరుకుని తమ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కొందరు సిట్టింగులను మార్చాల్సిందేనని, అలా మార్చకపోతే తాము వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండబోమని టీడీపీ అధిష్ఠానానికి సంకేతాలు పంపించారు. గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా, శింగనమలలో బండారు శ్రావణి, కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వరనాయుడు, అనంతపురంలో అమిలినేని సురేంద్రబాబు పేర్లను ఆయన సూచించారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో తాము సూచించిన అభ్యర్థులతో మాట్లాడి సీ ఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేశారు.
ఈ క్రమంలో కళ్యాణదుర్గం, అనంతపురం, శింగనమలలో టీడీపీ అధిష్ఠానం ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించింది. శింగనమలలో మూడురోజుల క్రితం వచ్చిన ఈ సర్వేలో సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీబాల, ఎంపీ జేసీ సిఫార్సు చేసిన బండారు శ్రావణి పేర్లు వినిపించా యి. కళ్యాణదుర్గంలో బోరేపల్లి మల్లికార్జున, ఉమామహేశ్వరనాయుడు, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, సురేంద్రబాబు పేర్లు వినిపించాయి. టీడీపీ అధిష్ఠానంపై ఎంపీ దివాకర్‌రెడ్డి ఒత్తిడి మేరకు అభ్యర్థుల మార్పుపై ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించగా అందులో వచ్చిన ఫలితాలనూ, సీఎం చంద్రబాబు వద్ద ఉన్న సర్వేలనూ బేరీజు వేసుకుని చివరగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించారు. అనంతపురం స్థానానికి అమిలినేని సురేంద్రబాబు పేరు ఎంపీ జేసీ సూచించినా ఆయన అక్కడి నుంచి పోటీచేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. గుంతకల్లు నుంచి మధుసూదన్ గుప్తా పేరు సూచించినా అక్కడ బీసీలకే అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. శింగనమలలో ఎంపీ జేసీ సూచించిన బండారు శ్రావణి, కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు పేర్లను సీఎం ఖరారు చేశారు. అనంతపురంలో ప్రభాకర్‌చౌదరి, కదిరిలో కందికుంట వెంకటప్రసాద్‌ను రంగంలోకి దించారు. టికెట్లు లభించని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్‌పై భరోసా కల్పించినట్టు సమాచారం.