మైలవరం వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వసంత వెంకట కృష్ణప్రసాద్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు వరసకు సోదరుడయ్యే వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజ రాజ్‌కుమార్ పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలు సేవా కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో ఎంతో కొంత సొంత ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్న రాజ్‌కుమార్‌కు, కృష్ణప్రసాద్‌కు ఇటీవల బాగా గ్యాప్ వచ్చింది. దీంతో రాజ్‌కుమార్ వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులంటున్నారు. కృష్ణప్రసాద్ తన ప్రత్యర్థి అయిన దేవినేని ఉమా మీద ఉన్న రాజకీయ కక్షను తీర్చుకునేందుకు ఉమా సోదరుడు చంద్రశేఖర్‌ను వెంట పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, తన బంధువు, వరసకు తమ్ముడయ్యే రాజకుమార్‌ను దూరం పెడుతున్నారని వారు విమర్శిస్తున్నారు.
నియోజకవర్గంలో వసంత నిర్వహిస్తున్న రోడ్డు షోలకు జనం నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. రాజ్‌కుమార్ వసంత వెంట ఉండి ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని వారు భావిస్తున్నారు. జ్యేష్ఠ రమేష్‌బాబు మైలవరం సమన్వయ కర్తగాను, జోగి రమేష్ పార్టీలో ఉన్న సమయంలో కాజ సొంత ఖర్చులతో షర్మిల, జగన్ పాదయాత్రలను విజయవంతం చేశారని, జగన్ బావ క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్ నిర్వహించిన క్రైస్తవ సభలకు తానే ఏర్పాట్లు చేయించాడని, పలు చర్చిల నిర్మాణానికి సాయం చేశాడని, అటువంటి రాజ్‌కుమార్‌ను దూరం పెట్టడం కృష్ణ ప్రసాద్‌కు, పార్టీకీ అంత శ్రేయస్కరం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్‌కుమార్ వైసీపీలో కొనసాగుతారా? తనకు సముచిత స్థానం ఇచ్చే పార్టీలోకి వెళ్లిపోతారా? స్వతంత్ర అభ్యర్థిగా మైలవరం నుంచి రంగంలోకి దిగుతారా? అనేది వేచి చూడాలి.
ఇది ఇలా ఉంటే, నిన్న నదీ తీర గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శనివారం చేపట్టిన ప్రచారం జనం లేక వెలవెల బోయింది. దాములూరు, కాచవరం, కొటికలపూడి గ్రామాల్లో వైసీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. కొటికలపూడిలో జరిగిన ప్రచారంలో గ్రామానికి చెందిన స్థానికులు పెద్దగా పాల్గొనకపోవటంతో మండల స్థాయి నాయకులు సైతం ప్రచారం మధ్యలో అభ్యర్థిని వదిలివెళ్లి పోవటం గమనార్హం. వైసీపీ నేతలు మాత్రం అధికార పార్టీ మంత్రి ప్రచారం వలన ఒత్తిడి చేశారని అందుకనే మధ్యాహ్నం సైతం ప్రచారం నిర్వహించాల్సి వస్తుందని, అందుకని జనం స్పందన తక్కువుగా ఉందని దాటవేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నేతలు ఒక్కరూ కూడ గ్రామాలు వైపు రాకుండా ఓట్లు ఎలా అడుగుతారని, సామాన్య ప్రజలు ప్రశ్నించారు.