ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జంప్ జిలానీలు అటూఇటూ మారుతూ పార్టీలనే కాదు.. ప్రజలనూ తికమక పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరేందుకు జగన్ నివాసానికి వెళ్లిన మాజీమంత్రి కొణతాల రామకృష్ణ పార్టీ అధినేతకే ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరేందుకు ప్రయత్నించిన కొణతాల అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఆశించారు. అయితే చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన అనుచరులైన ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ కార్పోరేటర్లు, బెహరా భాస్కరరావు, పోతు సత్యనారాయణ, బొనాల శ్రీనివాసరావు తదితరులతో శనివారం లోటస్పాండ్లో జగన్ను కలిశారు.
అరగంట భేటీ తర్వాత తన వారిని ఒక్కొక్కరినీ పరిచయం చేశారు. అనంతరం జగన్ అందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అయితే కొణతాల రామకృష్ణ మాత్రం పార్టీ కండువా కప్పుకునేందుకు నిరాకరించి జగన్కు ఝలక్ ఇచ్చారు. గతంలో తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తే చాలని కోరారు. అవన్నీ తర్వాత చూసుకుందామని జగన్ అన్నప్పటికీ కొణతాల సమ్మతించలేదు. పార్టీలో చేరకుండానే కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి వెళ్లిపోవడంతో జగన్ అవాక్కయ్యారు. అయితే తాను ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చించేందుకే తాను జగన్ని కలిశానని, పార్టీ చేరేందుకు కాదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
2014లో వైపీపీలో కీలకనేతగా ఉన్న ఈయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రాజీనామా చేశారు. అయితే ఆయన అప్పట్లో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతేకాదు రెండ్రోజుల క్రితం కూడా కొణతాల సైకిలెక్కుతారని వార్తలు వినవచ్చాయి. అయితే ఏం జరిగిందో ఏమోకానీ సడన్గా ఆయన సొంతగూటికి రావాలని నిర్ణయించుకున్నారు. మరో పక్క, మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీలో చేరారు. ఆదివారం (17-03-2019) కాకినాడలో జరిగిన టీడీపీ ప్రచార సభలో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. చంద్రబాబు హర్షకుమార్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు హర్షకుమార్. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని.. ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీలో చేరానన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు.