ఏపీలో తమ పాత్ర ఏమీ ఉండదని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఐదేళ్ల పాలన తర్వాత చేసింది చెప్పుకోలేకపోతున్నారని, చేసింది చెప్పుకోలేక ఆయన తమపై పడి ఏడుస్తున్నారని ఎద్దేవాచేశారు. ‘ఏప్రిల్ 11 తర్వాత మేం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామా? లేదా? అన్నది తెలుస్తుంది’ అని కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్‌కు వచ్చే సీట్లు జాతీయ పార్టీల కంటే ఎక్కువగా ఉంటాయని, జాతీయ పార్టీ పెట్టొచ్చు...తప్పేముందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాతీయ పార్టీ ఏర్పాటుపై స్పష్టత వస్తుందన్నారు. చంద్రబాబు ఇమేజ్ పాతాళంలో ఉందని కేటీఆర్ విమర్శించారు.
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఒక అప్పీల్ చేయబోతున్నారని తెలిపిన విషయం తెలిసిందే. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. రాజకీయాల నుంచి చంద్రబాబుకు వీడ్కోలు పలికేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న తమ పార్టీ టీఆర్‌ఎస్‌కు ఏపీలో అడుగుపెట్టాలన్న ఆలోచనలేమీ లేదని చెప్పారు. టీడీపీ, కేసీఆర్ మధ్య పోరుగా ఏపీ ఎన్నికలను చిత్రీకరించాలని బాబు ప్రయత్నించడం చాలా విచిత్రంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఏపీలో ఒక్క చోట కూడా పార్టీ కార్యాలయం లేదని, ఎన్నికల్లో కూడా అక్కడ తాము పోటీ చేయడం లేదని చెప్పారు. అయితే కేసీఆర్, కేటీఆర్ మాటిమాటికీ, జగన్ ని గెలిపించాలి, చంద్రబాబుని ఓడించాలి అని ఎందుకు అన్నారో, ఆయనే చెప్పాలి.
మరో పక్క, చంద్రబాబు కూడా ఘాటుగా స్పందించారు. జగన్‌కు ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వం తనకు డబ్బులివ్వడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. నేనూ చూస్తా ఆ డబ్బులు పనిచేస్తాయో? తన విశ్వాసం పనిచేస్తుందోనని అన్నారు. సోమవారం ఒంగోలులో టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ని గెలిపిస్తారా?, వాళ్ల డబ్బులు మనకు కావాలా? అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ఎవరైనా ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకుంటే వదిలేస్తారా? అంటూ చంద్రబాబు అడిగారు. ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు సృష్టించినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బంగారు గుడ్డుపెట్టే బాతుని ఇచ్చినా కేసీఆర్ ఏమీ చేయలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏమీ చేయని కేసీఆర్‌కు 88 సీట్లు వస్తే.. రాష్ట్ర అభివృద్ది కోసం 18 గంటలు పనిచేసిన మనకు ఎన్ని రావాలని అన్నారు.