బిహార్ తెలివితేటలు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయవని, వైసీపీ నుంచి ఫోన్లు వస్తే తిట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. సోమవారం నెల్లూరులో టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ధైర్యముంటే ముగ్గురు మోదీలు కలిసి రావాలని.. తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఏమీ చేయని కేసీఆర్ 88 సీట్లు గెలిస్తే.. అన్నీ చేసిన మనం 150 సీట్లు గెలవాలని చంద్రబాబు అన్నారు. తాను మూడు వేల సార్లు తిట్టానని కేసీఆర్ ఆరోపిస్తున్నారని.. మరి ఆంధ్రులను కేసీఆర్ ఎన్ని లక్షల సార్లు తిట్టారని చంద్రబాబు అన్నారు. కేసీఆర్..ఆంధ్రా బిర్యానీని పేడ అన్నారని, ఉలవచారును పశువులు తింటాయని అనలేదా? అని ప్రశ్నించారు.
మరి రాజకీయం కోసం ఏపీని వాడుకుంటారా? అంటూ చంద్రబాబు నిలదీశారు. అసలు ఢిల్లీలో చక్రం ఉంటేగా.. కేసీఆర్ తిప్పడానికి అంటూ ఎద్దేవా చేశారు. 25 ఎంపీ సీట్లు గెలిస్తే ఏపీకి న్యాయం ఎందుకు జరగదో చూద్దామని చంద్రబాబు అన్నారు. అన్నీ పార్టీలను ఏకం చేసే శక్తి సైకిల్‌కే ఉందని ఆయన అన్నారు. టికెట్ ఇస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి పక్క పార్టీతో లాలూచీ పడి పారిపోయారని విమర్శించారు. ఆయనను చూస్తే అసహ్యం వేస్తోందని చంద్రబాబు అన్నారు. స్వార్థం కోసం పార్టీలు మారే వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీలో సంఘవిద్రోహశక్తులు ఉన్నాయని అన్నారు. 11 కేసుల్లో ఏ1, ఏ2 ముద్దాయిలుగా ఉన్నవారు ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారని విమర్శించారు.
65 లక్షల మంది కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ పార్టీ. వైసీపీ దొంగల పార్టీ, కోడి కత్తి పార్టీ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇక వారి పార్టీలో చేరిన నేతలనీ ఉద్దేశిస్తూ.. ఆ నేతలు ఐదేళ్లు వారి పనులకు, స్వార్ధానికి వాడుకుని అందరి మధ్య చిచ్చులు పెట్టి టికెట్ ఇచ్చాక పార్టీ మారిపోయారు. ద్రోహం చేసిన అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఓడించాలి అని ఆయన ప్రజలని కోరారు. కార్యకర్తల త్యాగాల వల్లే ఇవాళ టీడీపీ ఇంత స్థాయికి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు గెలుస్తున్నాం. రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాం. గోదావరి, పెన్నాను అనుసంధానం చేసి నెల్లూరు జిల్లా నీటి సమస్యను పరిష్కరిస్తాం. నెల్లూరు జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు.