విశాఖ జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రాజకీయ భవితవ్యం గందరగోళంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్నా ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారాయన. శనివారం వైసీపీ అధినేతను కలిసి తన అనుచరులను పార్టీలో చేర్పించిన కొణతాల తాను మాత్రం వైసీపీ కండువా కప్పుకునేందుకు నిరాకరించారు. తాను కొత్తగా పార్టీలో చేరాల్సిన అవసరం లేదని, సస్పెన్సన్ ఎత్తివేస్తే సరిపోతుందని చెప్పడంతో జగన్ అసహనానికి గురైనట్లు సమాచారం. దీంతో తన అనుచరులతో చర్చించిన తర్వాతే పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకుంటానని చెప్పి కొణతాల వెళ్లిపోవడంతో జగన్ షాకయ్యారు.
అయితే సోమవారం ఆయన ఇచ్చిన ట్విస్ట్‌తో వైసీపీ, టీడీపీ నేతలు కూడా షాకయ్యారు. సోమవారం ఉదయం 10గంటల సమయంలో అమరావతిలోని చంద్రబాబు క్యాంపు ఆఫీసుకు వచ్చిన కొణతాల సీఎంతో అరగంట పాటు భేటీ అయ్యారు. గతంలో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఆశించిన కొణతాల చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో వైసీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఆ పార్టీ ఆదివారం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు ఒకేసారి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో కొణతాల మనస్తాపం చెందారు. దీంతో ఆయన టీడీపీ అధినేతతో టిక్కెట్‌పై చర్చించేందుకు భేటీ అయినట్లు తెలుస్తోంది.
విశాఖ జిల్లాలో కొన్ని సీట్లకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో కొణతాల టీడీపీ నుంచి పోటీ చేసేందుకు లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. తనకు జిల్లాలో ఏదొక సీటు కేటాయించాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత చంద్రబాబు నాలుగు జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్లినా.. కొణతాల మాత్రం అక్కడే ఉండి టీడీపీ కీలక నేతలతో చర్చిస్తున్నారు. వాస్తవానికి కొణతాల ముందు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వార్తలొచ్చాయి. రెండు సార్లు చంద్రబాబును కలవడంతో ఆయన సైకిలెక్కనున్నారని అనుకున్నారు. సరైన హామీ దక్కలేదో.. ఏమోగానీ అనూహ్యంగా రెండ్రోజుల క్రితం జగన్ కలిశారు. తీరా ఇక్కడ కూడా సీటు దక్కకపోవడంతో సడన్‌గా చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే టీడీపీ మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండింగ్ స్థానాల్లోనైనా కొణతాలకు అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి.