చంద్రబాబు తరుపున ప్రచారం చెయ్యటానికి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోమవారం విజయవాడ చేరుకున్నారు. ఆయన కొందరు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘‘ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి ఇక్కడికి వచ్చాను. అబ్బో... ఏం ఎండలు, వేడి తట్టుకోలేపోయాను. ఆ రోజు నా హోటల్ గదిలో ఏసీ కూడా పనిచేయలేదు. రాత్రంతా నిద్రలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా.. ఎప్పుడు కశ్మీర్ వెళ్లిపోదామా? అని రాత్రంతా ఎదురు చూశాను అంటూ గతాన్ని ఫరూక్ గుర్తుచేసుకున్నారు. ‘‘మీకు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు... మాకు 12 డిగ్రీలు ఉంటుంది మీరంతా కశ్మీర్‌కి రండి. చల్లదనాన్ని ఆస్వాదించండి.’’ అని వ్యాఖ్యానించారు.
మత సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘భాజపా పాలకులు వచ్చాకే... రాముడు మా వాడు, అల్లా మీ వాడు అంటూ విభేదాలు సృష్టిస్తున్నారు. అదో పెద్ద విషాదం. నేను ముస్లింని. నా భార్య ఇంగ్లిషు వనిత. ప్రతి ఒక్కరూ ఈ నేల నాదని భావించినప్పుడే సామరస్యంగా జీవించగలరు’’ అని చెప్పారు. చంద్రబాబు మైనార్టీల పట్ల తన సుహృద్భావాన్ని గతంలోనే నిరూపించుకున్నారని, ఇదే సందేశాన్ని రాష్ట్రంలోని మైనార్టీలకు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు ఇస్తానని చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సోదర రాష్ట్రాలు. రెండు రాష్ట్రాలు ఒకరి కష్టాల్లో మరొకరు పాలుపంచుకోవాలి. మోదీ ఒక్కరే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చగలరని కేసీఆర్ అనుకుంటే తప్పు.’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
‘‘మేం ప్రజల కోసం మెరుగైన భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నాం. విజయం సాధిస్తామన్న ఆశ ఉంది’’ అని చెప్పారు. ఏపీకిచ్చిన ఏ హామీని కేంద్రంలోని భాజపా నాయకులు అమలు చేయలేదు..మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు అని ఆయన చెప్పారు.‘‘ బాలాకోట్ దాడులకు ముందు రామమందిరం గురించి మాట్లాడినవాళ్లు ఇప్పుడు మాట్లాడటం లేదు. దాడుల తర్వాత కశ్మీరులో ఉగ్రవాదం తగ్గిందా? పాక్‌కు నిజంగానే గుణపాఠం చెప్పగలిగారా? అని ప్రశ్నించారు. మోదీ న్యూజిలాండ్ ప్రధానిని చూసి నేర్చుకోవాలని ఫరూక్ అభిప్రాయపడ్డారు. కోరేగావ్‌లో ఒక కుటుంబంపై 40 మంది గూండాలు దాడి చేస్తే, ఆ కుటుంబానికి మద్దతుగా ప్రధాని మోదీ ఒక్క మాటా మాట్లాడలేదు, అదే న్యూజిలాండ్ ప్రధాని మసీదులో జరిగిన దాడుల్లో చనిపోయిన వారికి చెందిన ప్రతి కుటుంబాన్ని పరామర్శించారని చెప్పారు.