తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నడూ లేని విధంగా ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా తెలంగాణలో పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అలాగే భారీ పోలింగ్ కూడా నమోదైంది. మరో పక్క ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల అయ్యాయి. లగడపాటి తెలంగాణలో ప్రస్తుత ప్రజల నాడి ప్రకారం ప్రజాకూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయని ప్రకటించారు. జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ మొత్తం టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా సర్వే ఫలితాలను విడుదల చేశాయి. అయితే నార్త్ టీవీ చానల్స్, తెలుగు రాష్ట్రాల పై ప్రసారం చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ సక్సెస్ కాలేదు. వారి అంచనా ఎప్పుడు తప్పుతూనే ఉంది. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల ప్రజా నాడి పట్టటంలో, ఈ నార్త్ టీవీ చానల్స్ ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి.
అయితే తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై ఇండియా టుడే తన సర్వేలో తెరాస పార్టీకి భారీ ఆధిక్యం ఇచ్చింది. ఇండియా టుడే ప్రకారం.. టీఆర్‌ఎస్: 79-91, ప్రజాకూటమి: 21-33, ఎంఐఎం: 4-7, బీజేపీ: 1-3 గెలుచుకోనున్నాయి. టీర్ఎస్ మరోసారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకోబోతోందంటూ ఇండియా టుడే సర్వే చూసిన పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతూ ఉండగా, తెరాస పార్టీకి అసలు 91 సీట్లు ఎలా వస్తాయని అంచనా వేసారో అర్ధం కాక రాజకీయ విశ్లేషకులు అవాక్కయ్యారు. అయితే, ఇండియా టుడే కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది.
రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేస్తూ, తెలంగాణాలో మళ్ళీ తెరాస వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నా, చాలా టైట్ ఎలక్షన్ జరిగింది, ఫలితాలు పోటా పోటీగా వస్తాయని ట్వీట్ చేసారు. "The exit poll result which if true will confirm the rise of a regional satrap: my own view, it's going to be a tighter race". మరో పక్క, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే విషయం చెప్పారు. ఇండియా టుడే కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్, ఈ సర్వేలను నమ్మవద్దు, చాలా పోటా పోటీగా ఎన్నిక జరుగింది అంటూ, స్వయంగా తనకు చెప్పారన్నారు. ఆ ఛానల్ సర్వేలో టీఆర్ఎస్‌కు 79 - 91 సీట్లు వస్తాయని తేలిందిన.. అయితే వాటిని రాజ్‌దీప్ ఖండించారన్నారు. ఉదయం 9 గంటలకు తనకు ఫోన్ చేసిన రాజ్‌దీప్.. ఎగ్జిట్ పోల్ చూసి కంగారుపడొద్దన్నారని ఉత్తమ్ తెలిపారు. ఆ ఫలితాలతో ఏకీభవించడం లేదని రాజ్‌దీప్ తనతో చెప్పారన్నారు. పోటీ హోరాహోరీగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.