ఎంతో శ్రావ్యంగా పాటలు పాడుతూ యూట్యూబ్లో లక్షాలాది శ్రోతలను అలరిస్తున్న పసల బేబిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. అలవోకగా పాటలు పాడుతూ యూట్యూబ్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పసల బేబిని సీఎం చంద్రబాబు అభినందించారు. బేబినీ ఎంపీ మురళీమోహన్, మహిళా చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి చంద్రబాబుకు పరిచయం చేశారు. సినీ పాటలతో లక్షలాది మంది అభిమానులను సోషల్ మీడియా ద్వారా మెప్పించడం గొప్ప విషయమని ప్రశంసించారు. అంతేకాదు బేబిని సీఎం సన్మానించారు. ఈ సందర్భంగా బేబి పాడిన పాటకు చంద్రబాబు ఫిదా అయ్యారు.
చంద్రబాబును కలిసిన అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ బేబిగారు అద్భుతమైన పాటలు పాడుతున్నారు. ‘‘ఆమె చదువుకోలేదు. సంగీత జ్ఞానం అంతకన్నా లేదు. బేబి మట్టిలో మాణిక్యం. వ్యవసాయ కూలిగా పనిచేస్తూ.. పనులు చేసేటప్పుడు పాటలు నేర్చుకుంది. ఆమె పాడిన పాటలను ఎవరికి వాళ్లే అద్భుతమని కొనియాడారు. బేబి పాటలను ఎవరో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఆమె ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్, కోటి, కీరవాణిలు ఆమెతో పాటలు పాడిస్తామని అంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా బేబిని ఇంటికి పిలిచి సత్కారం చేసి కొంత పారితోషకం కూడా ఇచ్చారు. చంద్రబాబు కూడా ఆమెను ఆశ్వీర్వదించారు. బేబిని వెలుగులోకి తేవాలని సీఎం చెప్పారు’’ అని మురళీమోహన్ తెలిపారు.
కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో గ్రామీణ గాయని బేబి పాడిన పాటలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పొలం పనులు చేసేటప్పడు ఆమె పాడిన పాటలు ఇప్పుడు సంచలనం అవుతున్నారు. టాలీవుడ్ అంతా ఆమె చుట్టూ తిరుగుతోంది. ఆమె పాడిన పాటలకు ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి, కోటి, ఏఆర్ రెహ్మాన్, కోటి, కీరవాణి, మురళీమోహన్లు ఆమె పాటలను ఆస్వాదించిన వారిలో ఉన్నారు. ప్రభుదేవా, నగ్మా నటించిన ప్రేమికుడు సినిమాలోని ‘ఓ చెలియా నా ప్రియసఖియా’ అంటూ ఆమె పాడిన పాటకు లక్షలాది లైక్లు, వేల షేర్, కామెంట్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పాటలతో లక్షలాది మంది అభిమానులను బేబి సొంతం చేసుకుంది. బేబి స్వస్తలం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని వడిశలేరు.