ప్రధాని మోదీ జనవరి 6న రాష్ట్రానికి రానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాష్ట్ర బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం.. దాని బదులు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఊసే ఎత్తకపోవడం.. రాజధాని, పోలవరం నిర్మాణాలకు అడ్డంకులు.. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకపోవడం, రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారంపై దాటవేతలపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడచిన నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమిచ్చిందో ప్రధాని సదరు సభలో వివరిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీని కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాద్‌లో కలిశారు.
ఈ సందర్భంగా ఏపీ వచ్చేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ హైదరాబాద్‌లో గురువారం సమావేశమైంది. కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ ముఖ్యులు హాజరై సుదీర్ఘంగా చర్చించారు. 11న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో 14న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అనుకూలంగా ఉంటుందని వారు గురువారం రాత్రి ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) తెలియజేశారు. ఆ తేదీ సాధ్యం కాదని పీఎంవో చెప్పడంతో రెండు, మూడు తేదీలు సూచించామని.. చివరకు జనవరి 6న ఖరారైనట్లు కీలక నేతలు తెలిపారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల మైదానం, లేదా పీడబ్ల్యూడీ గ్రౌండ్లో మోదీ సభ నిర్వహిస్తే బాగుంటుందని కోర్ కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది.
అయితే రాజధాని అమరావతి భూమిపూజకు 2015 అక్టోబరు 22న మోదీ వచ్చారని.. దోసెడు మట్టి.. చెంబుడు నీళ్లు తప్ప ఏమీ ఇవ్వలేదని ప్రజల్లోకి వెళ్లిందని.. అక్కడ సభ పెడితే ఈ నిధుల గురించి నిలదీస్తారని కోర్ కమిటీ అభిప్రాయపడింది. అయితే రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖలో బీజేపీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉండడం.. నేవీ ఉద్యోగులు, ఇతర ఉత్తరాది ప్రజలు ఉన్నందున అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించకుండా అక్కడ ప్రధాని సభ పెడితే.. ఇతర పార్టీలు ఆందోళన చేస్తే ఇబ్బందిగా మారుతుందన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాయలసీమలో కూడా వద్దనుకున్నారు. మోదీ గత ఎన్నికల సమయంలో తిరుపతిలోనే ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని.. ఇది, కడప ఉక్కు పరిశ్రమ మంజూరు చేయకపోవడం తలనొప్పిగా తయారవుతాయని, తుదకు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెమైతే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని మెజారిటీ నేతలు భావించారు.