నాలుగేళ్ల ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటుందో, చంద్రబాబు కూడా అన్నీ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆ ఇబ్బందులు ప్రజల నుంచి కాదు, రాష్ట్రం పై పగబట్టిన రాబందుల నుంచి. అన్ని వైపుల నుంచి, రాష్ట్రాన్ని కబళించటానికి ప్రయత్నాలు చేస్తుంటే, చంద్రబాబు వీరి బారిన రాష్ట్రం పడకుండా కాపాడుతూ వస్తున్నారు. విభజన జరిగి, అప్పులతో, రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని, అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి సమానంగా చేస్తూ, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చంద్రబాబు ముందుకు తీసుకు వెళ్తుంటే, వెనక్కు లాగే వారు అనేక మంది. పెద్దన్నగా ఆదుకోవాల్సిన కేంద్రం, నమ్మించి మోసం చేసింది. నిర్మాణాత్మకంగా పని చెయ్యాల్సిన ప్రతిపక్షాలు, అసెంబ్లీ కూడా రావటం లేదు.
పైగా సమాజంలో కుల గొడవలు రేపుతూ, ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డం పడుతున్నారు. అటు జగన్, ఇటు పవన్, సమాజాన్ని కులంతో విడదీస్తూ, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపాల్సింది పోయి, పక్క రాష్ట్రాల వారితో, ఏపి ద్రోహులతో కలిసి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క హైదరాబాద్ లో తిష్ట వేసిన మీడియా. మీడియా అంటే చంద్రబాబుకు అనుకూలం అనే పేరే కాని, వాళ్ళు కూడా తెలంగాణా భజనలోనే మునిగి తేలుతూ, ఏపి పై విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇలా అన్ని విధాలుగా, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటే, చంద్రబాబు మాత్రం ముందుకే వెళ్తున్నారు. దీనికి ప్రాధాన కారణం, జన బలం. ప్రజలు చంద్రబాబు వెంట ఉంటూ ఆయనకు ఇస్తున్న బలం.
దీనికి బలం చేకూరుస్తూ, విజయవాడలో ఫ్లెక్సీలు వెలిసాయి. ‘కేంద్రం నీపై కక్ష గట్టింది. పక్కరాష్ట్ర నాయకులతోపాటు స్వరాష్ట్ర ప్రతిపక్ష నాయకులూ ఒక్కటయ్యారు. అవినీతిపరులకు, నేరగాళ్లకు నువ్వంటే పడదు. సినీ పరిశ్రమ తమ స్వార్ధం చూసుకుంటుంది. మీడియా కూడా విషయాలు చెప్పదు. ఇప్పుడు నువ్వు ఒంటరివి, కానీ నేను మాత్రం నీవైపే ఉన్నాను. నా పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలి. నేను గర్వంగా తలెత్తుకు తిరగాలి. నా రాష్ట్రానికి నువ్వు కావాలి’ అంటూ విజయవాడ ఇందిరాగాంధీ కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటైన ఫ్లెక్సీ నగర వాసులను ఆకర్షిస్తోంది. భావిశెట్టి భాను అనే వ్యక్తి ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీ అందరినీ ఆలోచింపజేసేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.