వేలు పెడతా, కాలు పెడతా అంటున్న కేసీఆర్, మొత్తానికి ఏపిలో అడుగు పెట్టనున్నారు. కేసీఆర్ ఈ నెల 23నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బంగ, దేశ రాజధాని దిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 23న ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖకు బయల్దేరతారు. విశాఖలో శారద పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అయితే ఇక్కడ రాజకీయంగా ఎవరిని కలుస్తారు అనేదాని పై క్లారిటీ లేదు. వైజాగ్ లో బాధ్యతలు చూస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఈ పర్యటన ఏర్పాట్లు చూస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే కేసీఆర్ పర్యటన పై చంద్రబాబు స్పందించారు. మంచిది రానివ్వండి అంటూ ఆహ్వానించారు. తెలంగాణలో ఎన్నికల్లో ప్రచారానికి తాను వెళ్లిన నేపథ్యంలో కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చేసిన వ్యాఖ్యలను, చంద్రబాబు నాయుడు తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని వ్యాఖ్యానించారు. అందరినీ గందరగోళం చేసేందుకే కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం రావడంలేదని, పోలైన ఓట్ల కంటే కౌంటింగ్లో ఎక్కువ ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మన ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవడం మన ప్రాథమిక హక్కు అని, ఈవీఎంల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంలపై ఫిర్యాదులు రావడాన్ని తెదేపా పరిశీలిస్తోంది. తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతు అవడాన్నిఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల పేర్లు తొలగించడం, అనేక మందికి గుర్తింపు కార్డులు లేకపోవడంపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నారు. ఈ ఓట్ల తొలగింపుపై కుట్ర ఉందని తెదేపా భావిస్తోంది. ఎన్నికల సంఘాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని ఆ పార్టీ మండిపడుతోంది. ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా ముస్లిం ఓట్ల తొలగింపుపై ఆందోళన నెలకొన్న అంశాలపైనా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను అప్రమత్తం చేసే బాధ్యతను పార్టీ నాయకులకు చంద్రబాబు అప్పగించారు.