పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు స్టార్టప్ కంపెనీల ఏర్పాటులో లీడర్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలో నిలబడగా, తెలంగాణ చివరి స్థానంలో నిలిచింది. ఈమేరకు గురువారం ఢిల్లిలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ మరియు ప్రమోషన్ (డిఐపీపీ) దేశవ్యాప్త ర్యాంకులను ప్రకటించింది. గత ఏడాది రూపొందించిన స్టార్టప్ పాలసీ ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. బెస్ట్ పెర్ఫార్మర్ విభాగంలో మొదటి స్థానాన్ని గుజరాత్ దక్కించుకుంది. టాప్ పెర్ఫార్మర్స్‌గా వరుసగా కర్నాటక, రాజస్థాన్, ఒడిశా, కేరళ రాష్ట్రాలు నిలిచాయి. వివిధ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధికోసం స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్న తీరు, తీసుకుంటున్న చర్యల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చినట్లు డీఐపీపీ ప్రకటించింది. ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విధంగా ఆరు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చినట్లు పేర్కొంది.
మొత్తం ఆరు కేటగిరీల్లో ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చారు. వీటిలో బిగినర్స్, ఎమర్జింగ్ స్టేట్స్, వర్సిటీ లీడర్స్, లీడర్స్, టాప్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలున్నాయి. బుధవారం విడుదల చేసిన జాబితాలో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ జాబితాలో నూరు శాతం మార్కులు సాధించి గుజరాత్ చోటు దక్కించుకుంది. టాప్ ఫెర్ఫార్మెన్స్ విభాగంలో 85 శాతానికిపైబడి, నూరు శాతానికి లోబడి మార్కులు తెచ్చుకుని కర్నాటక, కేరళ, ఒడిశా, రాజస్థాన్‌లు చోటుదక్కించుకున్నాయి. అలాగే 75 శాతానికి పైబడి, 85 శాతానికి లోబడి మార్కులు తెచ్చుకుని లీడర్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలో నిబడగా బీహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వరుసగా ఆతర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. 50 శాతానికిపైబడి, 75 శాతానికి లోబడి మార్కులు సాధించి యాస్పరెంట్ లీడర్స్ విభాగంలో హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ చోటు దక్కించుకున్నాయి.
ఇక 25 శాతానికిపైబడి 50 శాతానికిలోబడి మార్కులు సాధించి ఎమర్జింగ్ స్టేట్స్ విభాగంలో అస్సాం, ఢిల్లిd, గోవా, జమ్ము, కాశ్మీర్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు నిలచాయి. ఇక చివరిగా 25 శాతానికి లోబడి మార్కులు సాధించి బిగినర్స్ విభాగంలో చత్తీస్‌గఢ్, మణిపూర్, మిజోరామ్, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు నిలచాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో డీఐపీపీ ఏడు విభాగాల్లో 38 అంశాల్లో వివిధ రాష్ట్రాలు పారిశ్రామిక అభివృద్ధికోసం తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసింది. 2016, జనవరి 16న స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ కార్యక్రమం కింద 19 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా 801 సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అయితే, ప్రారంభంలో దేశంలోని 18 రాష్ట్రాలు మాత్రమే స్టార్టప్ కంపెనీల ప్రారంభ కార్యాచరణను పాటించాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 27కు చేరింది. వీటితోపాటు మరో మూడు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా చేరాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో 14,600 స్టార్టప్స్ ప్రారంభమయ్యాయని డీఐపీపీ తెలిపింది. రాష్ట్రాలకు ర్యాంకింగ్‌లు ఇవ్వడంలో చొరవ తీసుకోవడానికి సంబంధించిన ఏడు అంశాలను, 38 కార్యాచరణకి సంబంధించిన అంశాలను తీసుకున్నామని అందులో విధానపరమైన మద్దతు, ఇంక్యుబేషన్ సెంటర్లు, సీడింగ్ ఫండింగ్, వెంచర్ ఫండింగ్, నిబంధనలను సరళృకృతం చేయడం ఉన్నాయన్నారు.