తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకున్నందుకు బదులుగా తాము కూడా ఆంధ్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తామని కేసీఆర్ స్పష్టం చేయడం తెలిసిందే. దీంతో ఆయన టీఆర్‌ఎస్ తరపున రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశిస్తారా లేక జగన్, పవన్ తో కలిసి వస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఆంధ్ర ప్రాంతం వారి పై ఉన్న ఆగ్రహావేశాలే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ విజయానికి ప్రధాన పాత్ర పోషించాయని విశే్లషకులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ప్రజలు మరిచిపోతున్న విషయాలను మళ్లీ గుర్తు చేసేందుకే ఆయన చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేశారని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన పథకాల కన్నా ఆంధ్ర పాలన అన్న ఒక్క అంశమే టీఆర్‌ఎస్ విజయంలో కీలకపాత్ర పోషించిందని వారంటున్నారు. అలాంటి కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఇక్కడ కూడా విభజన నాటి రోజులు, నాడు ఆయన మాట్లాడిన మాటలను ప్రజలు గుర్తుచేసుకుంటారన్నది అక్షర సత్యమని వెల్లడిస్తున్నారు. ఆంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుని పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టినా ప్రయోజనం ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రచారంలో చంద్రబాబును విమర్శించడం, ఆరోపణలు చేయడం వల్ల ఆయన పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని భావించి అలా చేసి ఉంటారని అంటున్నారు.
కేసీఆర్ కనుక వైకాపా, జనసేనలతో కలిసి వస్తే, చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టే అని అంటున్నారు. తెలంగాణలో మాదిరి కేవలం చంద్రబాబును విమర్శించి జగన్, పవన్‌ను విస్మరిస్తే అది టీడీపీకే లబ్ధి చేకూర్చే అవకాశాలు లేకపోలేదని వారు విశే్లషిస్తున్నారు. కాగా కేసీఆర్ వస్తానంటే ఎవరూ అడ్డుకోరని, ఎవరైనా ఎక్కడైనా రాజకీయాల్లో పాల్గొనడం, ప్రచారం చేసుకోవడం వారి హక్కు అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఆయన మాదిరి ఇక్కడికి ఎందుకొచ్చావని తాను ప్రశ్నించనని, రాష్ట్ర రాజకీయాల్లో స్వేచ్చగా పాల్గొనవచ్చని సూచించారు. కాగా కేసీఆర్ వస్తే తమకెంత ప్రయోజనమన్న విషయంపై వైకాపా, జనసేన లెక్కలు వేస్తున్నారు.