రాజధాని నిర్మాణంలో మరో ముందడుగు పడుతోంది. పరిపాలన నగరంలో ముఖ్యమైన సచివాలయ నిర్మాణ పనులు ఈనెల 19వ తేదీ నుంచి వేగిరం కానున్నాయి. ఐదు టవర్లుగా నిర్మిస్తున్న సచివాలయం కోసం అదే రోజు ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఆరంభం కానున్నది. దేశంలోనే అత్యంత భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్‌గా ఇది అరుదైన ఖ్యాతిని నమోదు చేసుకోబోతోంది. 12 వేల క్యూ.మీ. మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ జరగనున్నదని, దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదేనని బుధవారం సాయంత్రం ప్రజావేదికలో జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

amaravati 13122018 2

రాజధానిలో నూతన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యంత భారీ భవంతులకు దీటుగా, ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని, దీనికి సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా అదే స్థాయిలో చేపడుతున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణశిల్పి నార్మన్‌ ఫోస్టర్‌కి చెందిన ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్‌ సంస్థ సచివాలయం కోసం ఐదు టవర్ల నిర్మాణానికి సంబంధించిన ఆకృతులను, నిర్మాణ ప్రణాళికలను సీఆర్‌డీఏకు అందించింది. ఈ ఐదు టవర్లను ఒకే రాఫ్ట్‌ ఫౌండేషన్‌పై నిర్మిస్తున్నామని, అందుకోసం వేల మంది కార్మికులను, వందల సంఖ్యలో యంత్రాలను, టన్నుల కొద్ది నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఫోస్టర్ అండ్ పార్టనర్ సంస్థ అద్భుత ప్రణాళిక, సీఆర్‌డీఏ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఏకధాటిగా పూర్తి చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశామని వివరించారు.

amaravati 13122018 3

అమరావతిలో ముఖ్య పర్యాటక ఆకర్షణగా నిలిచే ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును నీరుకొండలో గల ఎత్తయిన పర్వత ప్రాంతంపై చేపడుతున్నారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ఎల్‌అండ్‌టీకి చెందిన ‘డిజైన్స్ అసోసియేట్స్’ రూపొందించిన ఆకృతులను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పరిశీలించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును పర్యాటకంగానే కాకుండా ఆ ప్రాంతాన్ని ముఖ్య వాణిజ్యకూడలిగా రూపొందించడం ద్వారా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ పార్ధసారధికి సూచించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా నిర్మించాలని సమావేశంలో అత్యధికులు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read