Sidebar

10
Sat, May

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను బాధిత ప్రాంతాల పునరుద్ధరణ బాధ్యతలో కేంద్రం విఫలమైందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండు చేశారు. తుపాను కారణంగా రూ.3400 కోట్ల నష్టం వాటిల్లిందని, వ్యవసాయ రంగంలోనే సుమారు రూ.1800 కోట్ల నష్టం వచ్చిందని బుధవారం లోక్‌సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏడు రోజుల పాటు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు పునరుద్ధరణ కార్యక్రమాలు పర్యవేక్షించి బాధిత ప్రాంతాల పునర్‌ నిర్మాణానికి కృషి చేశారన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గుంటూరు వచ్చిన సమయంలో రాష్ట్ర అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

rammohan 13122018

కానీ శ్రీకాకుళం వచ్చి వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిన ఆవశ్యకతను గుర్తించలేకపోయారని విమర్శించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ కూడా తిత్లీ తుపానుపై ఆవేదన వ్యక్తం చేశారని, కేంద్రం మాత్రం తగిన రీతిలో స్పందించలేదని అన్నారు. తిత్లీ బాధిత ప్రాంతాల పునరుద్ధరనకు రూ.539.52 కోట్లు అనుమతిస్తూ ఈ నెల 6న అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌రిజిజు తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు విడుదల చేసిన రూ.458.10 కోట్లకు ఇది అదనమని వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1330.67 కోట్లు సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం కోరిందని, ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం (ఐఎంసీటీ) నివేదిక ప్రకారం అత్యున్నత స్థాయి కమిటీ రూ.539.53 కోట్లు అనుమతించిందని తెదేపా ఎంపీ టీజీ వెంకటేశ్‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి రిజిజు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

rammohan 13122018

తిత్లీ తుపాను సహాయం కింద కేంద్రం ఇప్పటి వరకూ పైసా కూడా విడుదల చేయలేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. నిబంధనల మేరకు రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద రెండో కిస్తును మాత్రమే విడుదల చేసిందని వివరించింది. శ్రీకాకుళం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రెండు సార్లు లేఖ రాశారు. దానికి కేంద్రం స్పందించలేదు. తిత్లీ తుపాను వల్ల 3673 కోట్ల రూపాయల మేర నష్టం వాటల్లిందని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి వివరించడం తెలిసిందే. ప్రకృతి విపత్తుల సమయంలో ఏ ప్రధాని కూడా రాష్ట్రం పట్ల ఇంత కనికరం లేకుండా వ్యవహరించలేదని ముఖ్యమంత్రి ఆక్షేపించడం తెలిసిందే. హుదూద్ తుపాను సమయంలో 1000 కోట్ల సాయం ప్రకటించి, 600 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read