గవర్నర్ నరసింహన్‌తో ప్రజాకూటమి నేతలు భేటీ అయ్యారు. ప్రజాకూటమిని ఒక పార్టీగా గుర్తించాలంటూ గవర్నర్‌ను కలిసి కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐలు కలసి పోటీ చేసినందున ఈ కూటమిని అంతా ఒకటిగానే గుర్తించాలని విన్నవించనున్నాయి. ఈ భేటీలో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్అలీ, భట్టి విక్రమార్క, మధుయాష్కి, అజారుద్దీన్, టీడీపీ నుంచి ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరామ్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలను ఒక పార్టీగా పరిగణించాలని గవర్నర్‌ను నేతలు కోరారు. కూటమికి అత్యధిక స్థానాలు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తమకే ఇవ్వాలని నేతలు కోరారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీరాని పరిస్థితి ఏర్పడితే పోలింగ్‌కు ముందే పొత్తు కుదుర్చుకున్న ప్రజాకూటమికి ఎక్కువ సీట్లు వచ్చినట్లయితే వారినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితాలకు అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతున్నది. అదే జరిగితే గవర్నర్ ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ అంశంపై గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకున్న కూటమికే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫలితాల అనంతరం రాజ్యాంగబద్ధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాకూటమి ముఖ్య నేతలుగవర్నర్ నరసింహన్‌ను కలసి వినతిపత్రం అందచేసారు. ఫలితాల తరవాత తెరాసకు మద్దతిస్తామని భాజపా ప్రకటించడం పై చర్చిస్తూ ముందుముందు తలెత్తబోయే ఇలాంటి పరిణామాల గురించి గవర్నర్‌కు ముందే వివరించారు.
ఫలితాల తరవాత ప్రత్యర్థులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే అవకాశాల పై ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. రేవంత్‌రెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి అరెస్టు చేయడం, పోలింగ్ రోజున వంశీచంద్‌రెడ్డిపై భౌతిక దాడి చేయడం, వేలాదిమంది ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా జాబితాల నుంచి తొలగించడం వంటి అంశాలన్నింటిపైనా గవర్నర్‌కు వివరించారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించారు. అమిత్ షా, మోడీ కలిసి వివధ రాష్ట్రాల్లో చేస్తున్న పనులు చూసి, ప్రజా కూటమి నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. గోవా, జమ్మూ, నాగాలాండ్, కర్ణాటక రాష్ట్రాల్లో గవర్నర్ లను అడ్డు పెట్టుకుని, అమిత్ షా చేసిన అరాచకం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తరువాత, మన గవర్నర్ గారు ఏమి చేస్తారో చూడాలి.