ఉమ్మడి హైకోర్టును విభజించి రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ కావడంతో విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఎటువంటి ముందస్తు సంకేతాలు లేకుండా ఆకస్మికంగా ఉత్తర్వులు వెలువడంతో విజయవాడలో హైకోర్టు కార్యకలాపాల ప్రారంభంపై గందరగోళం నెలకొంది. తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 15 రోజుల్లో పూర్తవుతాయని భావిస్తున్న తరుణంలో ఉత్తర్వులు వెలువడంతో అప్పటి వరకూ హైకోర్టు కార్యకలాపాల నిర్వహణకు వీలుగా వసతి కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విజయవాడ నగరంలోని ఆర్ అండ్ బి భవనం, సీఎం క్యాంపు కార్యాలయ భవనాలను పరిశీలించింది. చివరికి సీఎం క్యాంపు కార్యాలయంలోనే జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది.
ముందుస్తు సమాచారం లేకపోవడం వల్ల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు వసతి కల్పన సమస్యగా మారుతోంది. కేసుల విభజన, పోర్టుపోలియోల కేటాయింపు వంటివి కూడా జరగాల్సి ఉంది. కీలకమైన అగ్రిగోల్డ్ కేసు ఏ రాష్ట్రానికి కేటాయిస్తారో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జనవరి 1 నుంచి 4 వరకు హైకోర్టు పనిదినాల అనంతరం 5 నుంచి 20 వరకూ సంక్రాంతి సెలవులు. ఐనప్పటికీ ఈ కాలంలో ఒక బెంచ్ పని చేయాల్సి ఉంటుంది. సెలవుల సమయంలోగా అమరావతిలోని తాత్కాలిక హైకోర్టు భవన సముదాయంలో పూర్తిస్థాయి వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇలాఉంటే కనీస ఏర్పాట్లు చేసుకునే వీలు కూడా లేకుండా ఉత్తర్వులు జారీ చేయడం అధికార వర్గాలను అసహనానికి గురి చేస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తీవ్రంగానే స్పందించారు. హైకోర్టు తరలింపులో కేంద్రం సరైన పద్ధతి లేకుండా వ్యవహరిస్తోందని, ఒక నెల రోజులు కూడా సమయం ఇవ్వకుండా, అయుదు రోజులు టైం ఇచ్చి, ఇంత పెద్ద హైకోర్ట్ విభాజన చేసారని విమర్శించారు. తరలింపులో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
అదే విధంగా అమరావతిలో న్యాయమూర్తుల ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తికాకపోవటంతో హైదరాబాద్ నుంచి వచ్చే న్యాయమూర్తులు, న్యాయవాదులకు తగు వసతి కల్పించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇలాఉంటే ఏపీలో హైకోర్టు కార్యకలాపాలపై అటు న్యాయవాదులు, ఇటు కక్షిదారులు దీనిపై గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాకోర్టుల్లో గడచిన వ్యాజ్యాలపై హైకోర్టులో కేసులు దాఖలైన సందర్భాల్లో ఈ రాష్ట్రంలోని న్యాయవాదులు తమతమ కక్షిదారులను హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీనియర్ న్యాయవాదులకు అప్పగించారు. ఆయా కేసులకు సంబంధించిన ఫైళ్లన్నీ ఆ న్యాయవాదుల వద్దనే ఉన్నాయి. కొత్తగా ఇక్కడ హైకోర్టు ఏర్పాటైతే అక్కడి న్యాయవాదులు తిరిగి తమతమ కేసులను అప్పగిస్తారా.. లేక తామే వచ్చి వాదించుకుంటామని చెబితే తమ పరిస్థితి ఏమిటని పలువురు న్యాయవాదులు మథన పడుతున్నారు. ఇక్కడికి రావటం ఇష్టం లేక ఎవరైనా తమ కేసులను ఒక వేళ తిరిగి తమకు అప్పగించినా కక్షిదారులు ఇచ్చిన అడ్వాన్స్‌లు పరిస్థితి ఏమిటనేది వెయ్యిడాలర్ల ప్రశ్న. దీనికి తగ్గట్లు ఆంధ్ర ప్రాంత కేసుల ఫైళ్లన్నీ ఎప్పటికి విభజిస్తారో తెలియని స్థితి. ఇది అంత తేలికైన విషయం కాదంటున్నారు. రాష్టప్రతి నోటిఫికేషన్ జారీతో కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది.