ఈవీఎంలపై పోరుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయంటూ గతంలోనూ పలుమార్లు జాతీయ స్థాయిలో ఉద్యమించిన తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ అంశంపై మరోమారు ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. బ్యాలెట్ పత్రాలతోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని.. ఈవీఎంలు విశ్వసనీయమైనవి కావనే అంశంపై వివిధ పార్టీలతో కలిసి పోరాడేలా కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈవీఎంల టాంపరింగ్‌కు అవకాశం ఉందని.. అందుకే అవి నమ్మకమైనవి కావన్నది చంద్రబాబు వాదన. ఇదే విషయాన్ని గతంలోనూ చాలాసార్లు జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.
ఈ నేపధ్యంలో ఈ రోజు పార్లమెంట్ లో జీరో హౌర్ లో ఈవీఎంల పై చర్చ చేపట్టాలని నోటీస్ ఇచ్చారు. ఎంపీలు మురళీ మోహన్, రవీంద్ర బాబు, ముత్తంసెట్టి శ్రీనివాసరావు ఈ నోటీస్ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనైనా మళ్లీ పాతపద్ధతిలోనే ఓటింగ్ నిర్వహించేలా ఇప్పటి నుంచే పోరాడాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు చేపట్టారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను కలుపుకొని వెళ్లేలా కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. ఈవీఎంలలో రెండు మూడు నెలల్లోనే రికార్డు మొత్తం చెరిగిపోతుందన్న విషయాన్ని కూడా జాతీయస్థాయికి తీసుకెళ్తున్నారు. తన పోరాటానికి సన్నాహాకంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంలపై ఫిర్యాదులు రావడాన్ని తెదేపా పరిశీలిస్తోంది.
తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతు అవడాన్నిఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల పేర్లు తొలగించడం, అనేక మందికి గుర్తింపు కార్డులు లేకపోవడంపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నారు. ఈ ఓట్ల తొలగింపుపై కుట్ర ఉందని తెదేపా భావిస్తోంది. ఎన్నికల సంఘాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని ఆ పార్టీ మండిపడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా ముస్లిం ఓట్ల తొలగింపుపై ఆందోళన నెలకొన్న అంశాలపైనా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను అప్రమత్తం చేసే బాధ్యతను పార్టీ నాయకులకు చంద్రబాబు అప్పగించారు.