ఇది నా నియోజకవర్గం. నీ యూనివర్సిటీ ఉన్నది నా పరిధిలో. ఇది నీ తాత సొమ్ముకాదు. నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదు. నేను చెప్పిందే జరగాలిక్కడ..అంటూ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య దామోదరనాయుడుపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్ర వ్యాఖ్యలతో ఊగిపోయారు. పట్టరాని కోపంతో చిటపటలాడారు. విశ్వవిద్యాలయం అధికారులపై దౌర్జన్యం చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. అంతటితో ఆగక.. తానెవరి కోసమైతే వకల్తా పుచ్చుకొని ఇలా తెగించారో.. చివరకు అదే వ్యక్తిపైనా చేయి చేసుకొన్నారు. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ పరిణామం వర్సిటీ వర్గాల్లో కలకలం రేపింది.
సమయం, సందర్భం లేకుండా రెచ్చిపోయిన ఎమ్మెల్యే వైఖరిపై ఉద్యోగులు ఆవేదన చెందారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి.. ఆది నుంచీ ఉద్యోగులపై ఇదే వైఖరి ప్రదర్శిస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. ఈసారి ఏకంగా యూనివర్సిటీ వీసీనే లక్ష్యంగా చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. గతంలో సస్పెండైన ఓ ఉద్యోగికి మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి తొలుత వీసీతో వాగ్వాదానికి దిగారు. దీనిపై ఆగ్రహించిన వీసీ దామోదరనాయుడు... ఏకవచనంతో సంబోధించడం, అసభ్య పదాలు వాడడాన్ని ఆక్షేపించారు. సస్పెండైన ఉద్యోగి జోక్యం చేసుకోబోతుండగా చెవిరెడ్డి.. అతడిని చితకబాదడంతో అందరూ విస్తుబోయారు. తిరుపతిలో రాష్ట్ర వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం జరుగుతుందని తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి అక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేసారు. ఈ సదస్సు జరగనివ్వబోనంటూ ఎమ్మెల్యే అక్కడే భీష్మించుకుని కూర్చోవడంతో వాయిదా వేశారు. మరో పక్క సమ్మె చేస్తున్న వ్యవసాయ కళాశాల విద్యార్థులు కూడా అక్కడికి వచ్చారు.
వారితో కలిసి ధర్నాకు ఉపక్రమించారు. వసతిగృహాల నుంచి వారిని ఎందుకు ఖాళీ చేయిస్తున్నారంటూ ప్రశ్నించారు. పోలీసుల ద్వారా చర్చలకు ఆహ్వానించగా చెవిరెడ్డి నిరాకరించారు. రాత్రివేళ వంటావార్పునకు సిద్ధమయ్యారు. వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహామండలి సభ్యులు ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీసీ దామోదరనాయుడుకు మద్దతుగా నిలిచారు. ఇటీవల తిరుపతిలో వ్యవసాయ కళాశాల ప్రధాన ద్వారం వద్ద మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి ఏర్పాటు చేసిన ఆచార్య ఎన్జీ రంగా విగ్రహావిష్కరణ సమయంలో శిలాఫలకంపై స్థానిక ఎమ్మెల్యేగా తన పేరు లేదని మంత్రుల సమక్షంలో దూషించారు. మంత్రుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటన జరిగిన 10 రోజులకే పెద్ద దుమారం రేగడంతో వర్సిటీలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. ఒకరోజు ముందు ఈ హడావిడి చేయడాన్ని పలువురు ప్రస్తావించారు. వీసీ చర్చలకు ఆహ్వానించినా చెవిరెడ్డి అందుకు నిరాకరించడం గమనార్హం.