అమరావతి: అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భాష, వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందుకు ఏపీ జేఏసీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియచేశారు. మంగళవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన పదోన్నతుల ద్వారా 12 వేల మందికి పైగా లబ్ది పొందుతున్నారన్నారు. విద్యాహక్కు చట్టంలో ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఉండాలని ఉన్నప్పటికి కొంతకాలంగా బాషోపాధ్యాయులు.
వ్యాయమ ఉపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లగా మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారని తెలిపారు. భాష ఉపాధ్యాయుల సంఘం వ్యాయమ ఉపాధ్యాయుల సంఘాలతో కలసి ఏపీ జేఎసీ అమరావతి తరపున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి డిసెంబరు 17న పదోన్నతులు కల్పిస్తూ జీవో విడుదల చేసిందని తెలిపారు. 10,224 మంది ఉపాధ్యాయులు, 2603మంది వ్యాయామ ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు టైం స్కేలు అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనిని వెంటనే కేబినేట్ సమావేశంలో అనుమతించాలని కోరారు.
మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, వీటిని ప్రభుత్వ పాఠశాలలో కలపాలని ప్రభుత్వాన్ని కోరిన ట్లు తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లకు టైమ్ స్కేలు అమలు చేయాలని, దీనిని క్యాబినెట్ లో ఆమోదించాలని ఆయన కోరారు. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వీరి వినతులన్నీ పరిశీలిస్తామని గంటా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ టీవీ పేర్రాజు, గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేశవనాయుడు, జిల్లా జేఏసీ చైర్మన్ ఈశ్వర్, కంకల కొండయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.