ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాయలసీమ చిరకాల స్వప్నం నెరవేరనుంది. సీమ ముఖ చిత్రాన్ని మార్చే కడప స్టీల్ ఫ్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం భూమి పూజ చేయనున్నారు. విభజన హామీలను కేంద్రం పట్టించుకోకపోవడంతో ఏపీ ప్రభుత్వమే సొంతంగా స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. రాయలసీమ చిరకాల స్వప్నం నెరబేరబోతోంది. ఏళ్ల తరబడి సీమవాసుల ఆకాంక్షగా ఉన్న ఉక్కు పరిశ్రమకు చంద్రబాబు ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నారు. జిల్లాలోని మైలవరం మండలం, కంబాలదిన్నెవద్ద కడప ఉక్కు ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి ఇవాళ శంఖుస్థాపన చేస్తారు. రూ. 18వేల కోట్ల పెట్టుబడితో, మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించనున్నారు.

kadapa 27122018 2

రాష్ట్ర విభజన బిల్లులో 11వ అంశంగా పొందుపరిచిన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ అంశం పై నాలుగేళ్లుగా కేంద్రం పట్టించుకోలేదు. ఎన్ని సార్లు చంద్రబాబు కేంద్రాన్ని అడిగినా, ఎంపీలు ఆందోళన చేసినా, కేంద్రం పట్టించుకోలేదు. చివరకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాధరెడ్డి నిరాహారదీక్ష కూడా చేసారు. దీక్ష విరమణ సందర్భంగా ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. చెప్పినట్టే, రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి, రాయలసీమ వాసుల కల నెరవేరుస్తుంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆకాంక్ష ఇప్పటిది కాదు. పదేళ్ల క్రితమే ‘బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ’ పేరిట ఆ దిశగా అడుగులు పడ్డాయి. పదివేల ఎకరాల్లో నిర్మించేందుకు అనుమతులు లభించినా, రాజశేఖర్ రెడ్డి, జగన్, గాలి జనార్ధన్ రెడ్డి చేసిన అవినీతి బయట పడటంతో, అది అటకెక్కింది. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, విభజన చట్టం హామీల్లో కడప ఉక్కు ప్రస్తావన రావడం తెలిసిందే. కేంద్రం పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఏళ్ల తరబడి కాలయాపనే జరిగింది. రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు దిల్లీ పెద్దలకు విన్నవించినా ఫలితం లేకపోయింది.

kadapa 27122018 3

మెకాన్‌ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక ఇచ్చినా కేంద్రం బహిర్గతం చేయలేదు. చివరకు పార్టీలకు అతీతంగా ఉద్యమ బాట పట్టడం, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ ఆమరణదీక్షకు దిగడంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. విషయం రెండు నెలల్లోగా తేల్చాలని చంద్రబాబు కేంద్రానికి అల్టిమేటం ఇచ్చినా స్పందన కరవైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వమే దాన్ని ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి ‘రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌’గా నామకరణం చేశారు. ప్రొద్దుటూరులో ధర్మపోరాట వేదికపై ఉక్కు పరిశ్రమ గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. నెలలో పునాదిరాయి వేసి కడప ప్రజల రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. తదనుగుణంగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గురువారం ఉదయం 11.12 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కడపలో ఉక్కు పరిశ్రమకు పునాదిరాయి వేసే వరకు గడ్డం తీయబోనంటూ దీక్షబూనిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ గురువారం తన దీక్ష విరమించనున్నారు. పునాదిరాయి కార్యక్రమం పూర్తయ్యాక తిరుమల చేరుకుని స్వామికి తలనీలాలు సమర్పించడంతో పాటు గడ్డం తొలగించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read