ప్రభుత్వాలు, మేము ఏమి చేసామో, ప్రజలకు చెప్పి, పాజిటివ్ వేవ్ లో ఎన్నికలకు వెళ్ళటం చాలా అరుదు. మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో చూసాం, కేవలం చంద్రబాబుని బూచిగా చూపించి ప్రచారం చేసేరే కాని, మేము ఇది చేసాం, ఇది చేసాం అని మాత్రం, ఎన్నికల ఎజెండాగా మార్చలేదు. చంద్రబాబు మాత్రం, తాను చేసిన పనులు, ఇప్పటికే నుంచే ప్రజల్లో చర్చకు పెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు అయిదు నెలల ముందు చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్వేతపత్రాల విడుదలకి శ్రీకారం చుట్టారు. ఇలా మొత్తం పది శ్వేతపత్రాలను విడుదల చేయబోతున్నారు. పది రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిననాడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? ఈ నాలుగున్నర ఏళ్ల తరవాత ఆయా శాఖల్లో సాధించిన అభివృద్ధి ఎంత? అనే అంశాలతోపాటు సంక్షేమ కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి అంశాలపై కూడా శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు.
అధికారంలో ఉన్న వాళ్ళు, ఎవరూ చెయ్యని విధంగా, చంద్రబాబు మదిలో ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే అంశంపైనే అటు టీడీపీ వర్గాల్లోనూ, ఇటు ప్రభుత్వ యంత్రాంగంలో చర్చ జరుగుతోంది. పెథాయ్ తుపాన్ కారణంగా రాష్ట్రంలో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం నష్టపరిహారం పెంచింది. దానితోపాటు అప్పటికప్పుడే ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీని కూడా ప్రారంభించింది. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, రైతులను ఆదుకునేందుకు రాష్ట్రసర్కారు ఉదారంగా ముందుకు వచ్చిన వైనాన్ని వివరిస్తూ శ్వేతపత్రం ప్రకటిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. ఇదే ఆలోచనను ఆయన చంద్రబాబుతో కూడా పంచుకున్నారు. అప్పుడు అంతగా స్పందించని చంద్రబాబు ఆ తర్వాత ఈ అంశంపై సుదీర్ఘంగా ఆలోచించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పడమే కాకుండా 2014నాటి పరిస్థితి ప్రస్తావిస్తూ 2019 వరకూ సాధించిన ప్రగతిని వివరిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేస్తే అవి ప్రజల్లోకి వెళతాయని ముఖ్యమంత్రి భావించారు. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా రాత్రికి రాత్రే శ్వేతపత్రాలను విడుదల చేస్తామని ప్రకటించారు.
జనవరి ఆరవ తేదీన ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు జిల్లాకు వచ్చి బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా గత నాలుగున్నర ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సాయం గురించి లక్షల లక్షల కోట్లు ఇచ్చామంటూ, ప్రజలని గందరగోళానికి గురి చేస్తారు. ఇదే మంచి తరుణమని భావించిన తెలుగుదేశం ఒక అడుగు ముందుకు వేసింది. శ్వేతపత్రాల రూపంలో ఈ నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వపరంగా సాధించిన అభివృద్ధిని వివరించబోతోంది. పనిలో పనిగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఏపీ పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి, ప్రత్యేకహోదా విషయంలో ప్లేటు ఫిరాయించడం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటి అంశాలను కూడా ప్రజల ముందుకు తేవాలని నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన మొదలైన శ్వేతపత్రాల విడుదల జనవరి 1వ తేదీ వరకు కొనసాగుతుంది. వీటన్నింటిపై గ్రామస్థాయి వరకు చర్చ జరగాలనీ, వాటిలోని విషయాలు ప్రజల్లోకి వెళ్లాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. పత్రికల్లోనూ, ప్రసార సాధనాల్లో కూడా వీటికి ప్రాచుర్యం కల్పించాలని భావిస్తున్నారు. సోమిరెడ్డి మెదడులో పుట్టిన ఒక ఆలోచన చివరకు రాష్ట్రంలో ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి అటు పొలిటికల్ కౌంటర్‌తో పాటు, ఇటు ప్రజలకు చేసింది చెప్పుకునేందుకు కూడా వీలు కల్పించింది.