ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధిలో కీలక దశలో ఉందని, అడ్డంకులు పెట్టేందుకు దుష్ట శక్తులు కుట్రలు చేస్తున్నాయని, అందరూ విజ్ఞతతో ఆలోచించాలని, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెదేపా నేతలతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన ముందు ప్రధానంగా మూడు బాధ్యతలున్నాయని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వం, పార్టీ బాధ్యతలను తాను చూసుకోవాల్సి ఉందన్నారు. ఎవరికీ చెడ్డపేరు రాకుండా అందరినీ కలుపుకొంటూ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 150 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లే లక్ష్యంగా నేతలంతా కృషి చేయాలన్నారు. శ్వేతపత్రాల్లో జరిగిన అభివృద్ధిని వివరించామని, కేంద్రం తోడ్పాటు లేదనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు తెలిపారు. 620 అవార్డులు సాధించడం దేశంలోనే రికార్డ్ అని అన్నారు. ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.
విభజన గాయంపై కారం పూయడానికే ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని.. అందుకే చెప్పేందుకు ఏమీ ఉండదన్నారు. విభజన చట్టంలో ఉన్నవి చేయలేదని, ఇచ్చిన హామీలనూ నెరవేర్చలేదని విమర్శించారు. రాజధాని పనులనో, పోలవరం పనులనో చూసేందుకు వస్తే బాగుండేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పనుల పరిశీలనకు కాకుండా పార్టీ కార్యక్రమాలకు రావడమే మోదీ రాజకీయమని దుయ్యబట్టారు. ప్రధాని పర్యటనకు గైర్హాజరు కావడమే తీవ్ర నిరసన అని చెప్పారు. ఆయన పర్యటకు ఎవరూ హాజరుకాకుండా గుణపాఠం చెప్పాలని కోరారు. జనవరి 1న రాష్ట్ర వ్యాప్తంగా భాజపాకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనల్లో పాల్గొని శాంతియుతంగా నిరసన తెలపాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
ప్రధాని మోదీ గుంటూరు పర్యటనపై వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఎందుకు మాట్లాడరని, ఆ రెండు పార్టీలు ఎందుకు నిరసనలు తెలపడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై తెదేపా 10 ధర్మపోరాట సభలు నిర్వహిస్తే వైకాపా, జనసేన ఏం చేస్తున్నాయని నిలదీశారు. రాయలసీమ ప్రజల చిరకాల కోరికగా ఉన్న కడప ఉక్కు పరిశ్రమకు రేపు శంకుస్థాపన చేస్తున్నామని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తోందని చంద్రబాబు వివరించారు. జనవరి 1న బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనాలని, శాంతియుతంగా నిరసనలు తెలపాలని సీఎం ఆదేశించారు. కేవలం పార్టీ కార్యక్రమానికి రావడమే మోదీ రాజకీయమని మండిపడ్డారు.