రేవంత్‌రెడ్డిని అరెస్ట్ తో తెలంగాణాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేవంత్ ను అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారో చెప్పాలని ఆయన సతీమణి గీత డిమాండ్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటలుగా ఓపికగా ఉన్నామని, కుటుంబసభ్యులతో పాటు రేవంత్ అనుచరులు, అభిమానుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. కొడంగల్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే తాము కోరుకుంటున్నామని గీత చెప్పారు. రేవంత్‌ను తీసుకెళ్లింది పోలీసులో కాదో తామెలా నిర్ధారించుకోవాలని ప్రశ్నించారు.
స్థానిక పోలీసులైతే హెల్మెట్లు పెట్టుకుని ఎందుకు వస్తారన్నారు. గుర్తింపు కార్డులు, అరెస్ట్ వారెంట్ కూడా చూపించకుండా రేవంత్‌ను తీసుకెళ్లారన్నారు. తీసుకెళ్లింది పోలీసులే అయినప్పుడు ఎక్కడున్నారో చెప్పడానికి ఇబ్బందేంటని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలంతా సంయమనంతో ఉన్నారని, రేవంత్ ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులుగా రేవంత్ వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమకు లేదా అని ప్రశ్నించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు కేసీఆర్ సభ ఎలా నిర్వహిస్తారని ఆమె పోలీసులను ప్రశ్నించారు. అయితే... ఆమె ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ.. సభకు అనుమతులున్నాయని చెప్పారు.
అయితే.. సభకు వెళ్లేందుకు తనకు కూడా అనుమతినివ్వాలని ఆమె పోలీసులను కోరారు. తెల్లవారుజామున 3గంటలకు బెడ్రూం లోపలికొచ్చి దొంగను ఈడ్చుకెళ్లినట్టు ఈడ్చుకెళితే చూస్తూ ఊరుకోవాలా అని రేవంత్ భార్య గీత పోలీసులను ప్రశ్నించారు. నేను కేసీఆర్ సభకు వెళ్తాను అంటూ ఆమె సంచలన నిర్ణయం తీసుకోవటంతో ఒక్కసారిగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి అరెస్ట్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్ కేసీఆర్ కుట్రే అని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల్ని కేసీఆర్ వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ సభ ఉంటే రేవంత్‌రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారన్నారు. ‘రేపు ఇదే పరిస్థితి నీ కూతురికి జరిగితే...ఎలా ఉంటుందో కేసీఆర్ ఆలోచించుకోవాలి’ అని కేసీఆర్‌ను జైపాల్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.